Bapatla Suicide: బాపట్ల జిల్లాలో విషాదం, కూతురి ప్రాణాలు బలి తీసుకున్న తండ్రి ఆవేశం
Bapatla Suicide: కన్నతండ్రి ఆవేశం, అనాలోచన కుమార్తె ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆవేశంతో కూతుర్ని మందలించి చదువు మాన్పిస్తానని భయపెట్టడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
Bapatla Suicide: బాపట్ల జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. క్లాస్‌మేట్ ఫోన్ కాల్‌తో ఆవేశానికి గురైన తండ్రి కుమార్తెను తీవ్రంగా మందలించాడు. చదువు మాన్పిస్తానని హెచ్చరించడంతో భయపడిన విద్యార్ధిని తానే తప్పు చేయలేదంటూ లేఖ రాసి ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
క్లాస్‌మేట్ ఫోన్ కాల్ విద్యార్ధిని ప్రాణాలు బలి తీసుకున్నాయి. నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన జక్కి గౌరప్ప, రామేశ్వరిలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రేణుక యల్లమ్మ (22) బాపట్ల జిల్లా మాచర్లలోని న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం సీఈసీ చదువుతోంది. ఇటీవలి సమ్మర్ హాలీడేస్ ముగియడంతో ఆమె కాలేజీకి వచ్చింది. మాచర్లలోనే కాలేజీ హాస్టల్‌లో ఉంటుంది.
రేణుకతో పాటు అదే కాలేజీలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి ఆదివారం సాయంత్రం రేణుకకు ఫోన్ చేశాడు. రేణుక వేరే పనిలో ఉండటంతో అతని కాల్‌కు స్పందించ లేదు. దీంతో ఆ విద్యార్థి రేణుక తండ్రి గౌరప్పకు ఫోన్ చేశాడు. రేణుక ఫోన్ తీయటం లేదని చెప్పాడు. దీంతో గౌరప్పలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎవరో అబ్బాయి తన కుమార్తె కోసం ఫోన్ చేయడమేమిటని ఆగ్రహంతో ఊగిపోయాడు.
వెంటనే కుమార్తె రేణుకకు ఫోన్ చేసి గట్టిగా మందలించాడు. కాలేజీలో చదువుకునే అమ్మాయిలకు అబ్బాయిలతో పనేంటని, ఆ అబ్బాయి ఎందుకు ఫోన్ చేస్తున్నాడని కుమార్తెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా ఈ విషయం కాలేజీలోనే తేలుస్తానంటూ రెచ్చిపోయాడు. తండ్రి సముదాయించేందుకు, తండ్రికి జరిగిన విషయం చెప్పేందుకు, ఆ అబ్బాయి ఎవరో తెలియజేసేందుకు ప్రయత్నించినా తండ్రి గౌరప్ప వినలేదు. సోమవారమే తాను కాలేజీకి వస్తానంటూ కుమార్తె రేణుకతో అనడంతో ఆమె తీవ్ర మనస్తాపానికిగురయింది. తండ్రి ఏం చేస్తాడోనని భయపడింది.
తండ్రి కాలేజీకి వస్తే జరిగే పరిణామాలను ఊహించుకుంటూ ఆత్మహత్య చేసు కోవాలని నిర్ణయించుకుంది. "నాన్న నేను ఏ తప్పూ చేయలేదు. నీ పరువు తీసే పని నేను చేయను. ఒకవేళ నేను తప్పు చేస్తే ఆ రోజే నా చివరి రోజు. నేను తప్పు చేశాననుకుంటే నేను బ్రతకను. ఒక వేళ నేను తప్పు చేశాననుకుని నువ్వు నా చదువు ఆపేసినా నేను బ్రతకను. నాన్న నువ్వే నా ధైర్యం. నువ్వే నన్ను నమ్మకుంటే ఎరవరకు నమ్ముతారు? నాన్న నేను తప్పు చేశాను అనుకుంటే, నేను బ్రతకడం వ్యర్థం. అమ్మ నన్ను క్షమించు. నేను చనిపోతున్నాను. నాన్న ఆ అన్న తప్పు ఏమీ లేదు. ఆ అన్న నన్ను అమ్మలా భావిస్తున్నాడు. స్వారీ నాన్న..." అని చిట్టీ రాసి హాస్టల్‌లోని ఖాళీగా ఉన్న గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని రేణుక ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలియక సోమవారం ఉదయం రేణుక తల్లిదండ్రులు జక్కి గౌరప్ప, రామేశ్వరి కుమార్తె కోసం హాస్టల్‌కు వెళ్లారు. రేణుక తల్లిదండ్రులు రావడంతో ఆమె స్నేహితులు రేణుక కోసం వెతికారు. ఆమె ఎక్కడ కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. అలా వెతుకుతూ ఖాళీగా ఉన్న గదివైపు వెళ్లారు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో రేణుక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించింది.
దీంతో హాస్టల్ సిబ్బంది, రేణుక తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. తన స్నేహితులతో చలాకిగా ఉండే రేణుక ఆత్మహత్య చేసుకోవడంతో అంతా విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు బోరున విలపించారు.
హాస్టల్ సిబ్బంది పోలీసులు సమాచారం ఇవ్వడంతో మాచర్ల టౌన్ సీఐ బ్రహ్మయ్య, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రేణుక స్నేహితుల నుంచి వివరాలు అడిగిన పోలీసులు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, రేణుక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్రం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు, హెచ్‌టి తెలుగు)