Anakapalli Tragedy: అనకాపల్లిలో ఘోరం.. హాస్టల్లో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థుల మృతి, 27మందికి అస్వస్థత
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాద ఘటన జరిగింది. ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం హాస్టల్లో సమోసాలు తిన్న గిరజన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సెలవు కావడంతో వారంతా సమీపంలోని బంధువుల ఇళ్లకు వెళ్ళారు. వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Anakapalli Tragedy: అనకాపల్లి జిల్లాలోని మిషనరీ హాస్టల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు పంచి పెట్టిన సమోసాలు తిని ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 27మంది అస్వస్థతకు గురయ్యారు.
బాధితులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అనకాపల్లి అనాథశ్రమంలో ముగ్గురు చిన్నారుల మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం డివిజన్ పరిధిలోని కైలాస పట్నంలో ఉన్న మిషనరీ ఆశ్రమ పాఠశాలలో 80 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. వీరంతా సమీపంలోని గిరిజన గ్రామాలకు చెందిన ఆదివాసీలు. శనివారం సాయంత్రం అల్పాహారంగా విద్యార్థులకు సమోసాలను ఇచ్చారు. వాటిని తిన్న తర్వాత విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు.
శనివారం పాఠశాల ముగిసిన తర్వాత పలువురు విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఆదివారం అస్వస్థతకు గురైన విద్యార్థుల్ని తల్లిదండ్రులు ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఒకటో తరగతి చదువుతున్న జాషువా,మూడో తరగతి చదువుతున్న భవానీ, శ్రద్ధలు ప్రాణాలు కోల్పోయారు.
శనివారం సమోసాలను తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్టు విద్యార్థులు చెబుతున్నారు. పాఠశాలలో ఉన్న 80మందిలో 27మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన వారిలో ఏడుగురు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆర్డీఓ పరామర్శించారు. ఈ ఘటనపై విద్యాశాఖ విచారణ చేపట్టింది.
శనివారం రాత్రి హాస్టల్ నిర్వాహకుడు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత వారికి సమోసాలు, చాక్లెట్లను హాస్టల్ నిర్వాహకులు పంచిపెట్టారు. శనివారం రాత్రి భోజనంలో సాంబారుతో పిల్లలకు భోజనం పెట్టారు. శనివారం రాత్రి నుంచి చిన్ానరులు వాంతలు, విరోచనాలతో బాధపడటంతో హాస్టల్ నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పిల్లల్ని ఇళ్లకు తీసుకు వెళ్లాలని చెప్పడంతో పిల్లల్ని తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకు వెళ్లిపోయారు. నర్సీపట్నం ఏరియాలోని కుల్లూరు, చింతపల్లి ఏజెన్సీ గ్రామాలకు చెందిన వారు హాస్టల్లో ఆశ్రయం పొందతున్నారు.
ఆదివారం చికిత్స పొందుతూ చింతపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు, కుల్లూరుకు చెందిన మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. కిరణ్ కుమార్ అనే వ్యక్తి స్థానికంగా చర్చితో పాటు ఆశ్రమ పాఠశాలను నిర్వహిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. దాతలు ఇచ్చిన ఆహారపదార్ధాలను చిన్నారులకు అందించినట్టు తెలుస్తోంది. కలుషిత ఆహార పదార్ధాలను భుజించిన చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న వారిలో పలువురు చిన్నారుల్ని మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.