Anakapalli Murder: అనకాపల్లి జిల్లాలో విషాదం, మద్యం మత్తులో కొడుకును హతమార్చిన తండ్రి
Anakapalli Murder: అనకాపల్లి జిల్లా విషాదం ఘటన చోటు చేసుకుంది. కన్నకొడుకును తండ్రి హత్య చేశాడు. మద్యం మత్తులో కొడుకుపై రాయితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వెంకునాయుడు పేటలో ఈ దారుణం జరిగింది.
Anakapalli Murder: పనిపాట చేయకుండా తండ్రిపైనే ఆధారపడి జీవిస్తున్న కుమారుడిని తండ్రి మద్యం మత్తులో హతమార్చాడు. కొడుకును ఏదొక పనిచేయాలని కొన్నాళ్లుగా తండ్రి మందలిస్తున్నాడు. ఈ విషయమై తండ్రి కొడుకుల మధ్య తరచూ గొడవలు జరిగాయి. ఆదివారం ఇంట్లోనే తండ్రికొడుకుల కలిసి మద్యం సేవించి గొడవకు దిగారు. ఈ సమయంలో ఇంట్లో ఉన్న సన్నికాలి రాయి తీసి కొడుకు తలపై బలంగా కొట్టాడు. దీంతో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ దారుణ ఘటన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వెంకునాయుడుపేట శివారు లక్ష్మీ నగర్‌లో చోటు చేసుకుంది. కన్న కొడుకును తండ్రి మద్యం మత్తులో హత్య చేసిన ఘటన ఆదివారం ఉదయం కలకలం రేపింది. నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం కొఠారి రమణ (70) అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి లక్ష్మీనగర్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు.
కొఠారి రమణ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యాడు. ఆయన భార్య మరణించి చాలా కాలమైంది. కొఠారి రమణ, సత్యవతి దంపతులకు భాస్కరరావు (32) కుమార్తె పావని ఉన్నారు. తండ్రీ, కొడుకు అపార్ట్‌మెంట్‌లో కలిసే ఉంటున్నారు. వీరికి వంట, ఇంటి పనులు చేసేందుకు పని మనిషి ఉంది.
కుమార్తె పావనికి వివాహం జరిగి నర్సీపట్నంలో ధర్మసాగరం సమీపంలో ఉంటుంది. ఆమె అప్పుడప్పుడు వచ్చి తండ్రి, తమ్ముడు యోగక్షేమాలు తెలుసుకుని వెళుతుంది. కుమారుడు భాస్కరరావు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్ పూర్తి చేసి ఖాళీగా ఉంటూ తండ్రి మీద ఆధారపడి జీవిస్తున్నాడు. అయితే గత కొద్దికాలంగా భాస్కరరావు దుబారా ఖర్చు చేస్తున్నాడని తండ్రీ, కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నా యి.
శనివారం సాయంత్రం భాస్కరరావు తన మిత్రుడుతో కలిసి బయట మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తిరిగి రాత్రి ఇంట్లో తండ్రితో సహా కుటుంబానికి సన్నిహితుడైన జిలానీతో కలిసి భాస్కరరావు కలిసి మద్యం సేవించాడు.
రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగడం పూర్తి అయిన తరువాత జిలానీ తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత డబ్బు దుబారా చేస్తున్నావంటూ తండ్రి, కొడుకు ఒకరిపై ఒకరు కేకలు వేసుకున్నారు. ఇలా తండ్రి, కొడుకుల మధ్య చాలా సేపు పెద్ద వాగ్వాదం కొనసాగింది. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ జరగడంతో తండ్రి రమణ ఆవేశంతో ఇంట్లో ఉన్న సన్నికాలి రాయితో భాస్కరరావు తల మీద బలంగా కొట్టాడు. దీంతో బాస్కరరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. కొడుకు మరణించిన విషయం తెలియని తండ్రి రమణ మద్యం మత్తులో తన గతిలోకి వెళ్లి నిద్రపోయాడు.
ఇంట్లో తండ్రి, కొడుకులు మాత్రమే ఉండడంతో ఆదివారం ఉదయం మెలుకువ వచ్చి బయటకు వచ్చి చూడగా రక్తపుడుగులో పడి ఉన్న కొడుకును చూసి బోరున విలపించాడు. కొద్ది సేపటికే ఇంటికొచ్చిన పనిమనిషికి రాత్రి జరిగిందంతా తండ్రి రమణ చెప్పాడు. దీంతో ఆమె ఇచ్చిన సమాచారంతో నర్సిపట్నం టౌన్ సీఐ గోవిందరావు, ఎస్ఐలు ఉమామహేశ్వరరావు, రమేష్, క్లూస్‌టీం సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పనిమనిషి ఇచ్చిన సమాచారంతో నిందితుడు రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం అయింది. తమ్ముడి మృతితో అక్క పావని, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బంధువులు కన్నీరు మున్నీరు అయ్యాయి. లక్ష్మీనగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)