Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీపై మూడో వారం కూడా నిలిచిన రాకపోకలు.. బోట్లు బయటకు తీసే వరకు ఇదే పరిస్థితి…
Prakasam Barrage: విజయవాడ - గుంటూరు మధ్య పాత గ్రాండ్ ట్రంక్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి మూడో వారం ప్రవేశించింది. ఆగస్టు 31న భారీ వర్షాలు, కృష్ణానదికి ఎగువ నుంచి పోటెత్తిన వరద నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిచిపోయాయి.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీపై దాదాపు మూడు వారాలుగా రాకపోకలు నిలిచిపోయాయి. 20ఏళ్ల తర్వాత బ్యారేజీపై గుంటూరు-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 2002-2003లో ప్రకాశం బ్యారేజీకి పూర్తి స్థాయిలో చేపట్టిన 22ఏళ్ల తర్వాత ఇన్ని రోజులు బ్యారేజీపై రాకపోకలు నిలిపివేశారు.
ప్రకాశం బ్యారేజీ నిర్మాణం చేపట్టి 50ఏళ్లు దాటడంతో 2002లో ప్రకాశం బ్యారేజీకి కొత్త గేట్లను అమర్చారు. బ్యారేజీని పూర్తిగా ఖాళీ చేసి ఎగువన రాతికట్ట నిర్మాణంతో పాటు మరో పాతికేళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త గేట్లను అమర్చారు. అప్పట్లో దాదాపు ఆర్నెల్లకు పైగా బ్యారేజీపై రాకపోకలు నిలిపివేశారు.
170ఏళ్ల చరిత్ర… 13లక్షల ఎకరాల ఆయకట్టు…
కృష్ణా డెల్టాను వరదల నుండి రక్షించడానికి నీటిపారుదల కోసం కాలువలు ,వరద బ్యాంకులతో కూడిన కృష్ణా ఆనకట్టను 1852 నుండి 1855 మధ్య నిర్మించారు. గోదావరి డెల్టా కాల్వలను రూపొందించిన సర్ ఆర్థర్ కాటన్ కృష్ణా డెల్టా కాల్వలను కూడా రూపొందించారు. దానిని కెప్టెన్ ఓర్ ఆధ్వర్యంలో నిర్మించారు. కృష్ణా డెల్టా ప్రాణం పోసుకున్న వందేళ్ల తర్వాత 1950వ దశకంలో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగింది. ప్రకాశం బ్యారేజీని 1954 నుండి 1957 మధ్య నిర్మించారు.
బ్యారేజీకి 2009లో గరిష్ట స్థాయిలో వరదలు వచ్చాయి. 2009 అక్టోబర్ 2 నుంచి 13 వరకు గరిష్ట స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుంది. గరిష్టంగా 11,10,404 క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో నమోదైంది. 2009 అక్టోబర్ 5న ప్రకాశం బ్యారేజీ నిర్మాణం తర్వాత అత్యధికంగా వరద విడుదల నమోదైంది. అంతకుముందు 1998 సంవత్సరంలో గరిష్టంగా 9,32,000 క్యూసెక్కుల వరద విడుదలైంది. 2009 తర్వాత పదిహేనేళ్లకు ఇటీవల భారీ వరదలు వచ్చాయి. గత రికార్డుల్ని చేరిపేస్తూ పదకొండున్నర లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది.
సెప్టెంబర్ మొదటి వారంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో విజయవాడ నుంచి మంగళగిరి వైపు రాకపోకల్ని నిలిపివేశారు. సాధారణంగా వరదలు వచ్చినా బ్యారేజీపై వాహనాల రాకపోకల్ని నిలిపివేయరు. వరద ప్రవాహం ఎక్కువగా ఉంటే ఆ సమయానికి వాహనాల రాకపోకల్ని క్రమబద్దీకరిస్తారు. ఇటీవల వచ్చిన వరదల్లో ప్రకాశం బ్యారేజీ ఎగువున గొల్లపూడి నుంచి భారీ పడవలు దిగువకు కొట్టుకు వచ్చేశాయి. బ్యారేజీ గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్‌లను ఢీకొట్టి ఎగువున నిలిచిపోయాయి.
వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినా బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకుపోయిన బోట్లను మాత్రం బయటకు తీయలేకపోయారు. దాదాపు పదిరోజులుగా బోట్లను బయటకు తీసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. బోట్లను ముక్కలుగా చేసి బయటకు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. క్రేన్లతో పైకి లేపేందుకు చేసిన ప్రయత్నాలు, బ్యారేజీ మోడల్ గెస్ట్ హౌస్ నుంచి పక్కకు లాగేందుకు ప్రయత్నించినా పడవను బయటకు తీయడం సాధ్యం కాలేదు. దీంతో కావడి పద్దతిలో వాటిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.
మరో దారి లేదు…
విజయవాడ నుంచి తాడేపల్లి మీదు మంగళగిరి వైపుకు రాకపోకలు సాగించాలంటే ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 17రోజులుగా వాహనాలను అనుమతించపోవడంతో కృష్ణా వారధి మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. వెలగపూడి సచివాలయంలో విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగులు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు పనుల కోసం వెళ్లే వారు, ప్రభుత్వ అధికారులు విజయవాడ వారధి మీదుగానే ప్రయాణిస్తున్నారు. దీంతో అదనంగా మూడు, నాలుగు కిలోమీటర్లు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది.
ప్రకాశం బ్యారేజీ నిర్మాణం చేపట్టి 70ఏళ్లు దాటిపోవడంతో పాతికేళ్ల క్రితమే దానిపై వాహనాల రాకపోకల్ని నిషేధించారు. సాధారణ కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలను మాత్రమే అనుమతంచేలా బ్యారేజీపై గడ్డర్లను ఏర్పాటు చేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అమరావతినిరాజధానిగా ఎంపిక చేయడంతో బ్యారేజీపై ఆంక్షల్ని ఎత్తేశారు. వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తూ ఏర్పాటు చేసిన గడ్డర్లను పూర్తిగా తొలగించారు. భారీ వాహనాలను బ్యారేజీపైకి అనుమతించకపోయినా వాహనాల విషయంలో ఆంక్షల్ని మాత్రం తొలగించారు.
ప్రత్యామ్నయం అవసరం…
నాలుగు జిల్లాల్లో 13లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేేే ప్రకాశం బ్యారేజీని వీలైనంత కాలంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బ్యారేజీకి ఎగువున, దిగువున కొత్త ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నా, ప్రకాశం బ్యారేజీ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు మరో బ్రిడ్జి అవసరం ఎంతైనా ఉంది. విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానిక కనెక్టివిటీ కోసం ప్రకాశం బ్యారేజీ సమీపంలోనే మరో వంతెన నిర్మాణం అవసరాన్ని తాజా పరిణామాలు చాటి చెబుతున్నాయి. రోజుల తరబడి వంతెన మూసేయాల్సిన పరిస్థితులు వస్తే ప్రత్యామ్నయం చూడాల్సిన అవసరం ఉంది.