ప్రకాశం జిల్లాలోని పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - రూ.550 కోట్ల ఆస్తి నష్టం...!-tobacco worth rs 550 crore gutted in fire at factory in prakasam district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ప్రకాశం జిల్లాలోని పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - రూ.550 కోట్ల ఆస్తి నష్టం...!

ప్రకాశం జిల్లాలోని పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - రూ.550 కోట్ల ఆస్తి నష్టం...!

ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలోని పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రూ. 550 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

పొగాకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

ప్రకాశం జిల్లాలోని పొగాకు కర్మాగారంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో రూ.550 కోట్ల విలువైన పొగాకు దగ్ధమైంది. ఫ్యాక్టరీలోని 'ఏ', 'బి' బ్లాకులను మంటలు చుట్టుముట్టడంతో సుమారు 11,000 టన్నుల పొగాకు కాలిపోయిందని ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

పొగాకు కర్మాగారంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మంటలను అదుపులోకి తెచ్చామని… అయితే స్థలం నుంచి దట్టమైన పొగ వెలువడుతోందని అధికారి ఒకరు తెలిపారు. ఐదు అగ్నిమాపక యంత్రాలను మోహరించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుండగా, మిగతా అన్ని కర్మాగారాలు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని సదరు అధికారి స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించి వీలైనంత త్వరగా వివరణాత్మక నివేదికను సమర్పించాలని ఆదేశించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఫ్యాక్టరీ వాళ్లు చెబుతున్నారు. అయితే ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంతో పెద్దఎత్తున మంటలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం