Tirupati Stampede live Updates : తిరుపతి టికెట్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట, ఆరుగురు మృతి- రేపు ఉదయం తిరుపతికి సీఎం
తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో అపశ్రుతి చోటుచేసుకుంది. టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6గురు మృతి చెందారు. సుమారు పదుల సంఖ్యలో అస్వస్థత గురయ్యారు. వీరిని హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Wed, 08 Jan 202506:23 PM IST
తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం-మహేష్ కుమార్ గౌడ్
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ ల జారీలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మరణించిన వారికి తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఇంతటి దుర్ఘటన జరగడం ఆత్యంత విచారకరం అన్నారు. ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించి వారిని ఆదుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా టీటీడీ పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు.
Wed, 08 Jan 202505:42 PM IST
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి - పవన్ కల్యాణ్
"వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచిస్తున్నాను.
మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారని తెలిసింది. వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచిస్తున్నాను. అదే విధంగా మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్లి పరామర్శించి మనో ధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలి. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్ల నిర్వహణలో అధికారులకు, పోలీసు సిబ్బందికి జనసేన నాయకులు, జన సైనికులు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను" -డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Wed, 08 Jan 202505:36 PM IST
తొక్కిసలాట ఘటనపై సీఎం సీరియస్, రేపు ఉదయం తిరుపతికి
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రేపు ఉదయం సీఎం చంద్రబాబు తిరుపతి వెళ్లనున్నట్లు తెలిపారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపులాట ఘటనలో ఆరుగురు చనిపోయారన్నారు. ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిచారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో సీఎం మాట్లాడారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన చెందారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ మేరకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని సీఎం ప్రశ్నించారు.
Wed, 08 Jan 202505:28 PM IST
తిరుపతి ఘటన దిగ్భ్రాంతికరం - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తిరుమల ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికరం అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుతో పాటుగా పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని చెప్పారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించాలని కోరారు.
Wed, 08 Jan 202505:25 PM IST
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది- మంత్రి లోకేశ్
"వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల నేపథ్యంలో తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తొక్కిసలాటలో నలుగురు భక్తులు మృతి చెందడం నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఇటువంటి అవాంచనీయ ఘటనలకు తావీయకుండా టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది"-మంత్రి లోకేశ్
Wed, 08 Jan 202505:11 PM IST
తిరుపతికి తొక్కిసలాట-ఆరుకు చేరిన మృతుల సంఖ్య
తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. గాయపడిన వారిని స్థానిక రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టికెట్ల జారీ కేంద్రా వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ ఘటనకు కారణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Wed, 08 Jan 202504:59 PM IST
నలుగురు భక్తుల మృతిపై మాజీ సీఎం వైయస్.జగన్ దిగ్భ్రాంతి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.
Wed, 08 Jan 202504:56 PM IST
టికెట్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం
తిరుపతిలో టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు మండిపడుతున్నారు. పాలన వ్యవస్థ నిర్వహణ లోపంతో పాటు పోలీసులే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గురువారం ఉ.5 గంటలకు టోకెన్లు ఇస్తామని ప్రకటించిన టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Wed, 08 Jan 202504:54 PM IST
తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి దిగ్భ్రాంతి
తిరుపతి విష్ణునివాసం వద్ద తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు చనిపోవడం అత్యంత బాధాకరం అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలందించేలా చూడాలని ఆదేశించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రుయా ఆసుపత్రి అత్యవసర సేవల విభాగం వద్ద పరిస్థితులను అదుపు చేయాలని హోంమంత్రి ఎస్పీని ఆదేశించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు.
Wed, 08 Jan 202504:52 PM IST
వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో తొక్కిసలాట
వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీకి తిరుపతి, తిరుమలలోని 8 ప్రాంతాల్లో 94 కౌంటర్లను ఏర్పాటు చేశారు. టైమ్ స్లాట్ దర్శన టోకెన్లు లేకుండా భక్తుల్ని అనుమతించమని టీటీడీ ప్రకటించడంతో...టికెట్ల కోసం భక్తులు పోటెత్తారు. విష్ణు నివాసం వద్ద టోకెన్లు జారీ చేసే కేంద్రాల్లో అంబులెన్స్ లు ఏర్పాటు చేసినా డ్రైవర్లు అందుబాటులో లేరని భక్తులు ఆరోపిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా బైరాగి పట్టెడ లోని రామానాయుడు స్కూల్ వద్ద తొక్కిసలాట జరిగింది.
Wed, 08 Jan 202504:49 PM IST
తిరుపతి తోపులాటలో నలుగురు భక్తుల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్ర్భాంతి
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని జరిగిన తోపులాటలో నలుగురు భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం అన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి అందుతున్న చికిత్స పై అధికారులతో సీఎం ఫోన్లో మాట్లాడారు. జిల్లా, టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని....క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సిఎం ఆదేశించారు.
Wed, 08 Jan 202504:46 PM IST
తిరుపతిలో తొక్కిసలాట
తిరుపతిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీనివాసం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో… తొక్కిసలాట జరిగి నలుగురు భక్తులు మృతి చెందారు. సుమారు 25 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు
Wed, 08 Jan 202504:41 PM IST
తిరుపతిలో తొక్కిసలాట
తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో అపశ్రుతి చోటుచేసుకుంది. టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 4గురు మృతి చెందారు. సుమారు 25 మందికి అస్వస్థత గురయ్యారు. వీరిని హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.