Tirupati SVVU Diploma Courses : తిరుపతి ఎస్‌వీవీయూ డిప్లొమా కోర్సుల ప్రవేశాలు, దరఖాస్తులకు జులై 22 చివరి తేదీ
Tirupati SVVU Diploma Courses : తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల విద్యార్థులు జులై 22లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
Tirupati SVVU Diploma Courses : తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలు చేయడానికి జులై 22 తేదీ గడువుగా యూనివర్సిటీ తెలిపింది. యూనివర్సిటీలోని 2024-25 విద్యా సంవత్సరానికి వెటర్నరీ పాలిటెక్నిక్‌లలో రెండేళ్ల డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 22 తేదీలోగా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సోమవారం (జులై 8) నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 22 అని యూనివర్సిటీ తెలిపింది. దరఖాస్తు యూనివర్సిటీ అధికార వెబ్‌సైట్ https://www.svvu.edu.in/లో చేయాలి.
కాలేజీలు-సీట్లు
రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో మొత్తం 990 సీట్లు ఉన్నాయని, అందులో 10 ప్రభుత్వ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కాలేజీల్లో 330 సీట్లు, 12 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 660 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో ఒక్కో కాలేజీకి 30 సీట్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఈడబ్ల్యూఎస్ కోట కింద మరో మూడు సీట్లు ఉన్నాయి. పది ప్రభుత్వ కాలేజీలకు 300 సాధారణ సీట్లు, 30 ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో ఒక్కో కాలేజీకి 50 సీట్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఈడబ్ల్యూఎస్ కోట కింద మరో ఐదు సీట్లు ఉన్నాయి. 12 ప్రైవేట్ కాలేజీలకు 600 సాధారణ సీట్లు, 60 ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు ఉన్నాయి.
అర్హత
ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు (నాలుగు సెమిస్టర్స్) ఉంటుంది. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ కోర్సుకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఐసీఎస్ఈ విద్యార్థులైతే సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ మూడు సబ్జెక్ట్స్, అలాగే సోషల్‌లో హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ సబ్జెక్ట్స్‌లో కనీసం రెండు సబ్జెక్ట్స్ చదివి ఉండాలి.
వయోపరిమితి...ఎంపిక విధానం
2024 ఆగస్టు 31 నాటికి అభ్యర్థి వయస్సు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2002 ఆగస్టు 31 నుంచి 2009 ఆగస్టు 31 మధ్య పుట్టిన వారై ఉండాలి. ఎంపిక విధానం పదో తరగతిలో వచ్చి మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. బోధనా ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.880 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.440 ఉంటుంది. రుసుమును ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి.
సీట్ల రిజర్వేషన్
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు కనీసం నాలుగేళ్ల పాటు నాన్ మున్సిపల్ ప్రాంతం (గ్రామీణ ప్రాంతం)లో చదివిన విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయిస్తారు. మున్సిపల్ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్
బీసీ-29 శాతం (బీసీ-ఏ 7 శాతం, బీసీ-బీ 10 శాతం, బీసీ-సీ 1 శాతం, బీసీ-డీ 7 శాతం, బీసీ-ఈ 4 శాతం), ఎస్సీ-15 శాతం, ఎస్టీ-6 శాతం, దివ్యాంగ-5 శాతం, ఆర్మీ పిల్లలకు-2 శాతం, ఎన్‌సీసీ-1 శాతం, స్పోర్ట్స్ కోటా-0.5 శాతం, స్కాట్స్ అండ్ గైడ్స్ కోటా-0.5 శాతం, ఈడబ్ల్యూఎస్ కోటా-10 శాతం ఉంటుంది. అలాగే అమ్మాయిలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తారు.
ప్రాంతాల వారీ రిజర్వేషన్
15 శాతం సీట్లు అన్ రిజర్వడ్. ఈ సీట్లు రెండు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ పరిధి విద్యార్థులకు మెరిట్ బేస్ ప్రకారం కేటాయిస్తారు. 85 శాతం సీట్లు ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధి అభ్యార్థులకు స్థానికత ఆధారంగా 42:22 నిష్పత్తిలో కేటాయిస్తారు.
కోర్సు ఫీజులు
కోర్సు ఫీజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో వ్యత్యసం ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.565, ఇతర ఫీజు రూ.4,255, రిఫండబుల్ డిపాజిట్ రూ.520, హాస్టల్, మెస్ డిపాజిట్ రూ.12,550, హాస్టల్ రూమ్ రెంట్ రూ.950 మొత్తం రూ.18,840 ఉంటుంది. అయితే హాస్టల్ ఎస్టాబ్లిస్‌మెంట్ ఛార్జీస్ రూ.470 ప్రతినెల చెల్లించాల్సి ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రూ.14,000, ఇతర ఫీజులు రూ. 7,500 మొత్తం రూ.21,500 ఉంటుంది. అయితే హాస్టల్, మెస్ ఇతర ఫీజులు కూడా కాలేజీలను బట్టీ ఉంటాయి.
ధ్రువీకరణ పత్రాలు
- పదో తరగతి హాల్ టిక్కెట్టు
- పదో తరగతి మార్కుల జాబితా
- కుల, బర్త్, స్థానిక ధ్రువీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికేట్సు
- టీసీ
- నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్
- స్థానిక సర్టిఫికేట్
- మూడు పాస్‌పోర్టు సైజ్ ఫోటోస్
- దివ్యాంగులైతే పీహెచ్ సర్టిఫికేట్
- ఆర్మీ పిల్లలైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్
- ఎన్‌సీసీ సర్టిఫికేట్
- స్పోర్ట్స్ సర్టిఫికేట్
- ఈబీసీ సర్టిఫికేట్
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం