Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Tirupati Stampede : వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో అపశ్రుతి చోటుచేసుకుంది. తిరుపతిలోని టికెట్ల కేంద్రాల వద్ద భారీగా భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని జరిగిన తోపులాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం అన్నారు. ఈ ఘటనలో గాయాలైన వారికి అందుతున్న చికిత్స పై అధికారులతో సీఎం ఫోన్లో మాట్లాడారు. జిల్లా, టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని....క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు.
తొక్కిసలాట ఘటనపై సీఎం సీరియస్, రేపు ఉదయం తిరుపతికి
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రేపు ఉదయం సీఎం చంద్రబాబు తిరుపతి వెళ్లనున్నట్లు తెలిపారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపులాట ఘటనలో ఆరుగురు చనిపోయారన్నారు. ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిచారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో సీఎం మాట్లాడారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన చెందారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ మేరకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని సీఎం ప్రశ్నించారు.
నలుగురు భక్తుల మృతిపై మాజీ సీఎం వైయస్.జగన్ దిగ్భ్రాంతి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.
తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి దిగ్భ్రాంతి
తిరుపతి విష్ణునివాసం వద్ద తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం అత్యంత బాధాకరం అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలందించేలా చూడాలని ఆదేశించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రుయా ఆసుపత్రి అత్యవసర సేవల విభాగం వద్ద పరిస్థితులను అదుపు చేయాలని హోంమంత్రి ఎస్పీని ఆదేశించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు.
సంబంధిత కథనం