CM Chandrababu : స్నేహపూర్వక పారిశ్రామిక విధానం అమలు చేస్తాం - సీఎం చంద్రబాబు
CM Chandrababu : తిరుపతి జిల్లా శ్రీసిటీలో పర్యటించిన సీఎం చంద్రబాబు...15 సంస్థల కార్యకలాపాలను ప్రారంభించారు. అనంతరం పలు సంస్థల సీఈవోలతో మాట్లాడారు. పరిశ్రమల కోసం ఫ్రెండ్లీ ఇండస్ట్రీయల్ పాలసీ తీసుకోస్తామని హామీ ఇచ్చారు. కంపెనీల ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు.
CM Chandrababu : సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. శ్రీసిటీలోని పలు ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. మరో 7 కంపెనీలకు శంకుస్థాపన చేశారు. మొత్తంగా 15 సంస్థల కార్యకలాపాలను సీఎం ప్రారంభించారు. అనంతరం శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్‌లో పలు సంస్థల సీఈవోలతో సమావేశమయ్యారు. పెట్టుబడుల ఆకర్షణే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ధ్యేయమని, అందుకు అనుసరిస్తున్న విధానాలపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. రానున్న ఐదేళ్లు ఎంతో కీలకమని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఫ్రెండ్లీ ఇండస్ట్రీయల్ విధానం అమల్లోకి తీసుకోస్తామన్నారు. రోజు రోజుకు ఏపీపై పారిశ్రామిక వేత్తలకు నమ్మకం పెరుగుతోందన్నారు. పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు పడుతున్నామని, ఇచ్చిన హామీలను గత ప్రభుత్వాలు నెరవేర్చలేదని, మీరైనా మా సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబుకు జపాన్ కంపెనీలు విజ్ఞప్తి చేశాయి. కంపెనీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులు ఉంటారని, వారిలో తెలుగు వారు ఒక్కరైనా ఉంటారని సీఎం చంద్రబాబు అన్నారు. భారతదేశానికి ఉన్న అడ్వాంటేజ్ యువత జనాభా అన్నారు. ఉత్తరభారతంలో జనాభా పెరుగుతోంది, దక్షిణ భారతంలో జనాభా అంతగా పెరగడంలేదన్నారు. గతంలో తానే జనాభా నియంత్రణ చర్యలు చేపట్టారని, కానీ ఇప్పుడు జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. డెమోగ్రఫీ ఉంటేనే అభివృద్ధి సాధ్యం అన్నారు. పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి సమస్యలున్నా తీరుస్తామని, అందులో ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. పరిశ్రమల ప్రోత్సాహకాలపై ఆలోచన చేస్తున్నామన్నారు.
శ్రీసిటీలో పారిశ్రామిక జోన్లు
పారిశ్రామిక వేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీసిటీలో 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీట్రేడ్ జోన్ ఏర్పాటయ్యాయన్నారు. 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. శ్రీసిటీ వల్ల ఇవాళ 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యామన్నారు. 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు గొప్ప విషయమన్నారు.
పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. ఈ సంపద ప్రజల సంక్షేమానికి ఉపయోగపడుతుందని సీఎం చెప్పారు. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయని గుర్తుచేశారు. పెట్టుబడులు కోసం ఎన్నో దేశాల్లో పర్యటించానని సీఎం గుర్తుచేశారు. భారత్‌ను ఐటీ ప్రపంచ పటంలో నిలుపుతుందని ఆనాడే చెప్పాన్నారు. హైదరాబాద్ లో పీపీపీ విధానంలో హైటెక్ సిటీ నిర్మించామన్నారు. శ్రీసిటీలో రూ. 1200 కోట్ల పెట్టుబడితో 4000 ఉద్యోగాలను ఇచ్చే తమ విభాగాలను నెలకొల్పేందుకు ముందుకొచ్చిన 5 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంది.
“శ్రీసిటీని స్పెషల్ ఎకనమిక్ జోన్‌గా గుర్తించాం. 30 దేశాలు శ్రీసిటీలో పరిశ్రమల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. సంపద సృష్టి ద్వారా సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుంది. చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీసిటీ దగ్గరగా ఉంది. శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా తయారు చేయాలనేది నా ఆలోచన. శ్రీసిటీ ఐజీబీసీ గోల్డెన్ రేటింగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నాం. శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. శ్రీసిటీని అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తాం. పచ్చదనం కోసం వంద శాతం వర్షం నీటి సంరక్షణకు చర్యలు చేపడతాం. వీలైనంత వరకు ఉత్పత్తి, లాజిస్టిక్ ధరలు తగ్గించాలి, ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది" అని సీఎం చంద్రబాబు అన్నారు. తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు చేసేందుకు శ్రీ సిటీ వేదిక కావాలని సీఎం అన్నారు.
సంబంధిత కథనం