Sanambatla Midnight Fire : శానంబట్ల మిస్టరీ మంటల గుట్టురట్టు, 19 ఏళ్ల యువతి చేసిన పనికి ఊరంతా హడల్-tirupati sanambatla midnight fire accident mystery revealed young girl set fire in village ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tirupati Sanambatla Midnight Fire Accident Mystery Revealed Young Girl Set Fire In Village

Sanambatla Midnight Fire : శానంబట్ల మిస్టరీ మంటల గుట్టురట్టు, 19 ఏళ్ల యువతి చేసిన పనికి ఊరంతా హడల్

Bandaru Satyaprasad HT Telugu
May 22, 2023 03:17 PM IST

Sanambatla Midnight Fire :తిరుపతి సమీపంలోని శానంబట్లలో మిస్టరీ మంటల గుట్టు విప్పారు పోలీసులు. తల్లి ప్రవర్తన నచ్చక 19 ఏళ్ల యువతి చేసిన పనికి గ్రామస్థులందరికీ గత కొన్ని రోజులుగా కంటిపై కునుకులేకుండా చేసింది.

శానంబట్ల అగ్ని ప్రమాదాలు
శానంబట్ల అగ్ని ప్రమాదాలు (Unsplash)

Sanambatla Midnight Fire :తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శానంబట్లలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఊరంతా అలజడి, గ్రామ దేవతకు కోపం వచ్చిందని పూజలు, బలులు మొదలుపెట్టారు. ఈ మంటల వెనుక ఉన్నది 19 ఏళ్ల యువతి అని పోలీసులు గుర్తించారు. తల్లి ప్రవర్తన నచ్చకపోవడంతో... వారి బంధువుల ఇళ్ల వద్ద అగ్ని పుల్లలు గీసి పడేస్తుందని, దీంతో అగ్నిప్రమాదాలు జరిగాయని పోలీసులు తెలిపారు. శానంబట్ల గ్రామానికి చెందిన పిల్లపాలెం కీర్తి అనే యువతి ఈ అగ్నిప్రమాదాలకు కారణమని పోలీసులు గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు

అసలేం జరిగిందంటే?

చంద్రగిరి మండలంలోని శానంబట్ల గ్రామం తిరుపతికి 15 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. గత కొన్ని రోజులుగా గ్రామంలో రాత్రులు ఉన్నట్టుండి మంటలు రావడం మొదలైంది. అధికారులు ఈ ఘటనలపై విస్తుపోయారు. ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి ప్రమాదాలకు కారణాలను అన్వేషించారు. వరుస అగ్ని ప్రమాదాలతో ఒక్కసారి గ్రామంలో మూఢనమ్మకాలు ప్రబలి... పూజలు, బలులు మొదలయ్యాయి. అయినా మంటలు ఆగలేదు. ఈ విషయం పోలీసులకు చేరడంతో... అర్థరాత్రులు పోలీసులు నిఘా పెట్టారు. దర్యాప్తులో అసలు విషయం తెలుసుకుని గ్రామస్థులు, పోలీసులు షాక్ అయ్యారు. మంటల మిస్టరీ వెనుక ఉన్నది ఓ యువతి అని గుర్తించారు. అగ్ని ప్రమాదాలు జరిగితే ఏదో కీడుగా భావించి తల్లితో పాటు ఊరు వదిలి వెళ్లే అవకాశం వస్తుందని కీర్తి ఇలా చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. తన తల్లి ప్రవర్తనలో మార్పు కోసమే ఇలా చేసిందని అంటున్నారు.

అగ్ని పెట్టెతో బంధువుల ఇళ్లకు నిప్పు

శానంబట్లలో ఇటీవల 12 అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ మంటలకు కీర్తి అనే యువతే కారణమని పోలీసుల విచారణలో తేలింది. గ్రామంలోని కొందరితో ఉన్న గోడవల కారణంగా వారి ఇళ్లకు మంట పెట్టిందని తెలిపారు. కీర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించిందని పోలీసులు వెల్లడించారు. అగ్గి పెట్టెతో బంధువుల ఇళ్లకు మంటలు పెట్టినట్లు నేరం ఒప్పుకుంది యువతి. నిందితురాలు కీర్తి వద్ద నుంచి రూ. 32 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనల వెనుక ఎలాంటి మూఢ నమ్మకాలు లేవని స్పష్టం చేశారు.

ఆర్థిక సాయం అత్యాశతో మరో ఇద్దరు

గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఎలాంటి రసాయనాన్ని వినియోగించలేదని పోలీసులు తెలిపారు. ఇందులో ఎలాంటి తాంత్రిక శక్తి లేదన్నారు. మూఢనమ్మకాలను నమ్మకండని ప్రజలను కోరారు. తన ఇంటికే యువతి మూడు సార్లు నిప్పు పెట్టిందని పోలీసులు తెలిపారు. అయితే అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారికి ఆర్థిక సాయం చేస్తున్నారన్న విషయం తెలుసుకుని... అత్యాశకు పోయి గ్రామంలో ఇద్దరు కావాలనే తమ ఇళ్లకు నిప్పు పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో కీర్తితోపాటు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

IPL_Entry_Point