Janasena Kiran Royal : కిరణ్ రాయల్ వీడియోలు వైర‌ల్, వైసీపీ చిల్లర రాజకీయాలంటూ జనసేన నేత ఆరోపణలు-tirupati kiran royal videos viral in social media ysrcp cheap politics janasena leader alleged ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena Kiran Royal : కిరణ్ రాయల్ వీడియోలు వైర‌ల్, వైసీపీ చిల్లర రాజకీయాలంటూ జనసేన నేత ఆరోపణలు

Janasena Kiran Royal : కిరణ్ రాయల్ వీడియోలు వైర‌ల్, వైసీపీ చిల్లర రాజకీయాలంటూ జనసేన నేత ఆరోపణలు

HT Telugu Desk HT Telugu
Updated Feb 09, 2025 04:19 PM IST

Janasena Kiran Royal : తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. తన వద్ద రూ.1.20 కోట్లు తీసుకుని మోసం చేశారని మహిళ ఓ వీడియో విడుదల చేశారు. సదరు మహిళను కిరణ్ రాయల్ బెదిరించారని ఓ ఆడియో, ఆమెతో సన్నిహితంగా ఉన్న ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

కిరణ్ రాయల్ వీడియోలు వైర‌ల్, వైసీపీ చిల్లర రాజకీయాలంటూ జనసేన నేత ఆరోపణలు
కిరణ్ రాయల్ వీడియోలు వైర‌ల్, వైసీపీ చిల్లర రాజకీయాలంటూ జనసేన నేత ఆరోపణలు

Janasena Kiran Royal : తిరుప‌తి జ‌న‌సేన ఇన్ ఛార్జ్ కిర‌ణ్ రాయ‌ల్‌పై వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతూ వైర‌ల్ అవుతుంది. త‌న‌ను బెదిరించి, మోసం చేసి రూ.కోటికి పైగా న‌గ‌దు, బంగారం కిర‌ణ్ రాయ‌ల్‌ కాజేశాడ‌ని, అందుకే తాను ఆత్మహ‌త్య చేసుకుంటాన‌ని మ‌హిళ వీడియో విడుద‌ల చేసింది. అనంత‌రం ఆ మ‌హిళ‌తో స‌న్నిహితంగా ఉన్న వీడియో విడుద‌ల అయింది. అలాగే ఆ మ‌హిళ‌కు కిర‌ణ్ రాయ‌ల్‌ ఫోన్ చేసి బెదిరించిన ఆడియో క్లిప్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఈ రెండు వీడియోలు, ఆడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో ప్రచారం జ‌రుగుతుంది. అయితే త‌న‌పై వైసీపీ దుష్ప్రాచారం చేస్తోంద‌ని కిర‌ణ్ రాయ‌ల్ ఖండించారు.

అస‌లేం జ‌రిగింది?

కిరణ్ రాయల్‌ను న‌మ్మి మోసం పోయాన‌ని తిరుప‌తికి బైరాగ‌ప‌ట్టడుగుకు చెందిన ఓ మ‌హిళ వీడియోలో పేర్కొంది. అప్పులు చేసి ప‌లుసార్లు రూ.1.20 కోట్ల వరకు కిరణ్ రాయల్‌కు అప్పు ఇచ్చాన‌ని తెలిపింది. అలాగే 25 స‌వ‌ర్ల బంగారం కూడా ఇచ్చాన‌ని పేర్కొంది. అయితే కూట‌మి ప్రభుత్వం వ‌చ్చిన వెంట‌నే ఇచ్చినదానికి రెండింత‌లు ఇస్తాన‌ని చెప్పాడ‌ని పేర్కొంది. త‌న పిల్లల‌ను చంపుతాన‌ని బెదిరించి, కేవ‌లం రూ.30 లక్షలకు చెక్కులు బాండ్లు రాయించారని మ‌హిళ తెలిపింది. త‌న వ‌ద్ద ఉన్న వీడియో రికార్డు తీసుకున్నాడ‌ని, అయితే త‌న వ‌ద్ద అన్ని ఆధారాలు ఉన్నాయ‌ని పేర్కొంది. అప్పులు ఎక్కువైపోయాయ‌ని, పిల్లల‌కు స‌మాధానం చెప్పలేక‌పోతున్నాన‌ని, ఇక బ‌త‌క‌లేన‌ని తెలిపింది.

కిరణ్ రాయల్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తాను చనిపోయిన తరువాత అయినా ఆ డబ్బులు తన పిల్లలకు చెందాలని కోరింది. అయితే కిర‌ణ్ రాయ‌ల్‌ను త‌న‌కు రావ‌ల్సిన డ‌బ్బులు అడిగితే, ఆయ‌న త‌న‌పై బెదిరింపుల‌కు దిగాడ‌ని తెలిపింది. అందుకే వీడియో విడుద‌ల చేసి ఆత్మహ‌త్యకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ వీడియో శ‌నివారం సామాజిక మాధ్యమాల్లోకి వ‌చ్చింది. మహిళా ఆత్మహత్యాయత్నం చేసుకుని వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

బెదిరించిన ఆడియో క్లిప్ చ‌క్కెర్లు

వీడియో బ‌య‌ట‌కు రాగానే కిర‌ణ్ రాయ‌ల్ బాధిత మ‌హిళ‌కు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఆమెను నానా బూతులు తిడుతూ నిన్ను ఏం చేస్తానో అని బెదిరించారని ఓ ఆడియో వైరల్ అవుతోంది. మ‌ర్డర్ చేసి జైలుకు పోయి 40 రోజుల్లో బెయిల్ తీసుకుని బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని బెదిరించారని మహిళ ఆరోపించారు. ఈ బెదిరింపుల‌కు సంబంధించిన ఆడియో క్లిప్‌ను మ‌హిళ విడుద‌ల చేసింది. ఇప్పుడు ఈ ఆడియో క్లిప్ కూడా సామాజిక మాధ్యమాల్లో చ‌క్కర్లు కొడుతోంది.

కిరణ్ రాయ‌ల్ స్పంద‌న‌

ఈ వివాదంపై స్పందించిన జ‌న‌సేన నేత కిర‌ణ్ రాయ‌ల్ త‌న‌పై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నార‌ని అన్నారు. క్రిమినల్‌ లేడీతో నిరాధార ఆరోపణలు చేయించార‌ని, త‌న‌కు ఆ మహిళ రూ.1.20 కోట్లు ఇచ్చినట్లు ఆధారాలులేవని అన్నారు. వైసీపీ ఆడుతున్న చిల్లర రాజకీయం ఇదని, భూమన అభినయరెడ్డి ఇలా చేయిస్తున్నార‌ని విమ‌ర్శించారు.

స‌న్నిహితంగా ఉన్న వీడియో వైర‌ల్‌

ఇది ఇలా ఉండ‌గా తాజాగా బాధిత మ‌హిళ‌తో స‌న్నిహితంగా ఉన్న వీడియో బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఈ అంశంపై చ‌ర్చోప చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. మ‌హిళా సంఘాలు ఎంట్రీ ఇచ్చాయి. ఆయ‌న ఇంటి ముందు ఆందోళ‌న‌కు దిగాయి. ఐద్వా తిరుప‌తి జిల్లా కార్యద‌ర్శి సాయిల‌క్ష్మి మాట్లాడుతూ బాధిత మ‌హిళ‌ల‌కు న్యాయం చేయాల‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ అంశాన్ని చాలా తీవ్రంగా ప‌రిగ‌ణించి చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం