Tirupati : కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన మహిళకు షాక్, చెక్ బౌన్స్ కేసులో అరెస్టు చేసిన జైపూర్ పోలీసులు
Tirupati : తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసిన మహిళ లక్ష్మీని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఫ్రాడ్ కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా కిరణ్ రాయల్ చేయించారని లక్ష్మీ ఆరోపిస్తున్నారు.

Tirupati : తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మోసం చేశాడంటూ ఆరోపణలు చేసిన మహిళ లక్ష్మీని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి తిలక్ రోడ్డులోని శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద జైపూర్ పోలీసులు లక్ష్మీని అదుపులోకి తీసుకున్నారు. చెక్ బౌన్స్ కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కిరణ్ రాయల్ తనను మోసం చేశారని, తనకు ఇవ్వాల్సిన రూ.1.20 కోట్లు ఇవ్వడంలేదని లక్ష్మీ ఇటీవల ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.
అరెస్టుకు ముందు ఆమె తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ...తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. ఎక్కడ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా అండగా ఉంటానన్న పవన్ కల్యాణ్, చంద్రబాబు, జగన్ ను తనకు న్యాయం చేయాలని కోరుతున్నానన్నారు. తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
కిరణ్ రాయల్ మాయమాటలకు తాను మోసపోయానన్నారు. తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నట్లు చెప్పారు. కిరణ్ రాయల్ నుంచి ప్రాణ హాని ఉందని ఆరోపించారు. తనకు ఏ పార్టీ నుంచి మద్దతు లేదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ న్యాయం చేయాలని కోరారు. మరోవైపు ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీని గ్రీవెన్స్‌లో కలిసి లక్ష్మీ ఫిర్యాదు చేశారు.
వైసీపీ ట్వీట్
లక్ష్మీరెడ్డి అరెస్టుపై వైసీపీ స్పందించింది. 'తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుంది. పాత చెక్ బౌన్స్ కేసుని తెరపైకి తెచ్చి.. జైపూర్ పోలీసులపై ఒత్తిడి తెచ్చి కూటమి ప్రభుత్వం లక్ష్మీని అరెస్ట్ చేయించింది. గత మూడు రోజులుగా తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ పై లక్ష్మీ పలు ఆరోపణలు చేశారు. బాధితురాలికి న్యాయం చేయకుండా వేధిస్తారా?' అని వైసీపీ ట్వీట్ చేసింది.
అయితే లక్ష్మీ అరెస్టు విషయాన్ని తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ ఇప్పటికే ప్రస్తావించారు. ఆమెపై రాజస్థాన్ లో ఫ్రాడ్ కేసులు ఉన్నాయని, రెండ్రోజుల్లో జైపూర్ పోలీసులు అరెస్టు చేయబోతున్నారన్నారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు నిద్రమాత్రలు వేసుకుని డ్రామా ఆడారని ఆరోపించారు.
కిరణ్ రాయల్ వ్యవహారంపై అంతర్గత విచారణ
తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ పై గత కొన్ని రోజులుగా పలు ఆరోపణలు వచ్చాయి. కిరణ్ రాయల్ పై వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో జనసేన అధిష్టానం స్పందించింది. ఈ ఆరోపణలపై క్షుణ్ణమైన విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాల నుంచి దూరం ఉండాలని జనసేన పార్టీ ఆదేశించింది.
ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలని, సమాజానికి ప్రయోజనంలేని వ్యక్తిగతమైన విషయాలను పక్కకు పెట్టాలని జన సైనికులు, వీర మహిళలు, నాయకులకు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.
సంబంధిత కథనం