Tirumala Rains : తిరుమలలో భారీ వర్షాలు, రేపటి వరకు శ్రీవారి మెట్టు నడకమార్గం మూసివేత-tirupati heavy rains ttd closed tirumala route srivari mettu on october 17th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Rains : తిరుమలలో భారీ వర్షాలు, రేపటి వరకు శ్రీవారి మెట్టు నడకమార్గం మూసివేత

Tirumala Rains : తిరుమలలో భారీ వర్షాలు, రేపటి వరకు శ్రీవారి మెట్టు నడకమార్గం మూసివేత

Bandaru Satyaprasad HT Telugu
Oct 16, 2024 06:20 PM IST

Tirumala Rains : భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని రేపటి వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. కొండ చరియలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఈవో అధికారులను ఆదేశించారు

తిరుమలలో భారీ వర్షాలు, రేపటి వరకు శ్రీవారి మెట్టు నడకమార్గం మూసివేత
తిరుమలలో భారీ వర్షాలు, రేపటి వరకు శ్రీవారి మెట్టు నడకమార్గం మూసివేత

వాయుగుండం ప్రభావంతో తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని రేపటి(గురువారం) వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు బుధవారం ఉన్నతాధికారులతో వర్చువల్ గా సమావేశమయ్యారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

విపత్తుల నిర్వహణ ప్రణాళికపై అధికారులతో చర్చించి, పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ భారీ వర్షాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.

కొండచరియలపై ప్రత్యేక నిఘా

కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని, అందుకు ప్రత్యేక నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ ముందస్తుగా జనరేటర్లకు డీజిల్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఐటీ వింగ్ భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి కార్యాకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు.

ఇక వైద్య శాఖ తగినన్ని అంబులెన్సు లను అందుబాటులో పెట్టుకుని సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలని ఈవో జె.శ్యామలరావు ఆదేశించారు. ఇంజినీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఇప్పటికే పాపవినాశనం, శిలా తోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. వాతావరణ పరిస్థితుల అనుగుణంగా ఈ మార్గాల్లో రాకపోకలను టీటీడీ పునరుద్ధరించనుంది.

తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు

రెండు రోజులుగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల ధాటికి తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం ఉదయం కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని హరిణి సమీపంలో విరిగిపడ్డాయి. ఆ సమయంలో వాహనాలు ఏమీలేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు...సహాయచర్యలు చేపట్టారు. జేసీబీలతో రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగించారు. భారీ వర్షాల నేపథ్యంలో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని, ఘాట్ రోడ్డులో వెళ్లి వాహనదారులను టీటీడీ అప్రమత్తం చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం