Tirupati Gangamma Jatara : రాష్ట్ర పండుగ తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం, సారె సమర్పించిన భూమన కుటుంబం-tirupati gangamma festival mla bhumana karunakar reddy offers pattu saree to goddess ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Tirupati Gangamma Festival Mla Bhumana Karunakar Reddy Offers Pattu Saree To Goddess

Tirupati Gangamma Jatara : రాష్ట్ర పండుగ తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం, సారె సమర్పించిన భూమన కుటుంబం

తిరుపతి గంగమ్మ జాతర
తిరుపతి గంగమ్మ జాతర (Twitter )

Tirupati Gangamma Jatara : తిరుపతి గ్రామదేవత శ్రీతాతయ్య గుంట చిన్న గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభం అయింది. మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో జాతర మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి సారె సమర్పించారు

Tirupati Gangamma Jatara : తిరుపతిలో గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభం అయింది. మంగళవారం అర్థరాత్రి చాటింపుతో తిరుపతి గ్రామ దేవత శ్రీతాతయ్యగుంట చిన్నగంగమ్మ జాతర వేడుక మొదలైంది. ఇటీవలె గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది ప్రభుత్వం. ఈ ప్రకటన తర్వాత జరుగుతున్న తొలి వేడుక కావడంతో మరింత వైభవంగా నిర్వహిస్తు్న్నారు. కైకాల వంశస్థులు మంగళవారం అర్ధరాత్రి భేరి వీధిలో తొలి పూజ నిర్వహించారు. అనంతరం శివారులోని నాలుగు కాళ్ల మండపం, హెడ్‌ పోస్టాఫీస్, కృష్ణాపురం ఠాణా, పాత మెటర్నిటీ ఆసుపత్రి సర్కిల్‌ ప్రాంతాల్లో అష్టదిగ్బంధనం చేసి చాటింపుతో జాతర ప్రకటన చేశారు. ఈ చాటింపుతో తిరుపతి శ్రీతాతయ్యగుంట చిన్నగంగమ్మ జాతర ప్రారంభం అయింది. మే 16 వరకు గంగమ్మ జాతర జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు

ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు

తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సారె సమర్పించారు. స్థానిక పద్మావతి పురంలోని భూమన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భూమన కరుణాకర రెడ్డి, కుటుంబ సభ్యులు పసుపు, కుంకుమపట్టు చీరలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మ వారికి సమర్పించారు. తిరుపతి వీధులు గంగమ్మ నామ స్మరణతో హోరెత్తింది. నవ దుర్గలు, కాంతారా, తప్పెటగుళ్లు, డప్పులు, తీన్ మార్, కీలు గుర్రాలు, దింసా, పగటి వేషగాళ్లు, పులివేషాలు, గరగలు, బోనాల కళాప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

రాష్ట్ర పండుగా గంగమ్మ జాతర

తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు... సమ్మక్క సారలమ్మ జాతర్ల లాగానే తిరుపతి గంగమ్మ జాతర ప్రసిద్ధమైంది. తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలను వారి జీవన విధానాలను ప్రతిబింబించే విధంగా జాతర నిర్వహిస్తారు. తిరుపతి గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించే జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. తిరుపతి శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతరను ప్రభుత్వం ఇటీవలె రాష్ట్ర పండుగగా గుర్తించింది. తాతయ్య గుంట గంగమ్మ జాతరను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి విజ్ఞప్తి మేరకు గత ఏడాది సీఎం జగన్ గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని భూమన కోరారు. ఈ విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గంగమ్మ జాతర రాష్ట్ర పండుగా ప్రకటించింది.