Vaikunta Dwara Darshan Tokens : జనవరి 9న వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ- తిరుపతి, తిరుమలలో 91 కౌంటర్లు ఏర్పాటు
Tirumala Vaikunta Dwara Darshan Tokens : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. జనవరి 10, 11, 12 తేదీలకు.. జనవరి 9న టోకెన్లు జారీ చేయనున్నారు. తదుపరి రోజులకు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.
Tirumala Vaikunta Dwara Darshan Tokens : తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. వైకుంట ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు(మొదటి మూడు రోజులకు) జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు భక్తులకు జారీ చేస్తామన్నారు. తదుపరి రోజులకు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
మొత్తం 91 కౌంటర్లలో టోకెన్లు జారీ
తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, ఇందిరా మైదానం , శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎం.ఆర్. పల్లి స్కూల్ లలో కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తిరుమలలో బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో తిరుమల స్థానికులకు కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు టోకెన్లు జారీ చేయనున్నట్లు ఈవో ప్రకటించారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్ లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు.
కౌంటర్ల వద్ద ప్రత్యేక క్యూలైన్లు
కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నామని ఈవో శ్యామలరావు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. సర్వదర్శనం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శించుకోవాలని సూచించారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో గౌతమి, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీధర్ లతో కలిసి ఈవో శ్యామలరావు తనిఖీ చేశారు.
జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం-బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకుని జనవరి 7వతేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
జనవరి 7వ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
జనవరి 7వ తేది కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో 6వ తేదీన సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ప్రకటించింది.
సంబంధిత కథనం