Tirumala :వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీఠ, 10 రోజుల పాటు సిఫార్సు లేఖలు,ప్రత్యేక దర్శనాలు రద్దు-టీటీడీ
Tirumala : తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకెన్ లేని భక్తులకు దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. టోకెన్లపై నిర్దేశించిన తేదీ, సమయానికి మాత్రమే దర్శనాలకు రావాలని భక్తులకు సూచించారు.
Tirumala : వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకెన్ లేని భక్తులకు దర్శనాలు ఉండవని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో బుధవారం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకెన్ లేని భక్తులు తిరుమలకు వస్తే దర్శనాలు చేయించడం సాధ్యం కాదని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు పదిరోజుల పాటు సిఫార్సు లేఖలు స్వీకరించమని చెప్పారు.
జనవరి 9వ తేదీన తిరుపతిలోని 8 కేంద్రాల్లోని 90 కౌంటర్లలో, తిరుమలలో ఒక కేంద్రం(తిరుమల స్థానికులకు మాత్రమే)లోని 4 కౌంటర్లలో భక్తులకు 10, 11, 12వ తేదీలకు సంబంధించి 1.20 లక్షల ఎస్ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తామన్నారు. భక్తులు సంయమనంతో టోకెన్లు పొందాలని కోరారు. 13వ తేదీ నుంచి 19వ తేది వరకు ఏరోజుకారోజు టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని, భక్తులెవ్వరూ అధైర్యపడకుండా టోకెన్లు పొందాలని సూచించారు. భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా మాస్కులు ధరించి తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేశారు.
వైకుంఠ ఏకాదశి రోజున
జనవరి 10వ తేదీ ఉదయం 4.30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని, ఆ దర్శనాలు పూర్తికాగానే 8 గంటలకు సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో ఊరేగుతారని, అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు మలయప్పస్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారని తెలియజేశారు. జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రత్యేక దర్శనాలు రద్దు
"పదిరోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్, వృద్ధులు, చంటిపిల్లలు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాము. తిరుమలలో వసతి గదులు తక్కువగా ఉన్న కారణంగా దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే క్యూలైన్లలోకి అనుమతిస్తాం. పదిరోజుల పాటు తిరుమలలో వసతి గదుల ఆన్ లైన్ బుకింగ్ రద్దు చేసి సీఆర్వో వద్ద సామాన్య భక్తులకు వసతి గదులు కేటాయిస్తాం. భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు తమకు కేటాయించిన తేదీ, సమయానికే దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 7 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు చేశాము"- టీటీడీ ఛైర్మన్, బీఆర్ నాయుడు
2770 సీసీ కెమెరాలు
వీఐపీలకు జారీ చేసిన టికెట్లపై ముద్రించిన పార్కింగ్ వివరాల మేరకు తమకు కేటాయించిన సమయానికే వాహనాల్లో రావాలని టీటీడీ ఛైర్మన్ భక్తులను విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో సర్వ దర్శన టోకెన్ల జారీ కేంద్రాల్లో, తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా దాదాపు 3వేల మంది పోలీసులు, 1550 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తిరుమలలో 2770 సీసీ కెమెరాలు, తిరుమల తిరుపతి SSD కౌంటర్లలో అదనంగా 50 కెమెరాలతో భద్రతా పర్యవేక్షించనున్నట్లు తెలియజేశారు. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా మంచినీరు, అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తామని చెప్పారు.
విద్యుత్ , పుష్పాలంకరణపై ప్రత్యేక దృష్టి
విద్యుత్, పుష్పాలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి మైసూర్ దసరా ఉత్సవాల్లో విద్యుత్ అలంకరణ చేపట్టే నిపుణులతో ఈ ఏడాది ప్రత్యేక విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. క్యూలైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. టీటీడీ సమాచార కేంద్రాలు, ఎస్వీబీసీ ఛానళ్లు, ఎస్వీబీసీ రేడియో, ఆల్ ఇండియా రేడియో, టీటీడీ వెబ్ సైట్స్, టీటీడీ సోషల్ మీడియా ద్వారా భక్తులకు అవసరమైన సమాచారాన్ని విస్తృత ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిధంగా తిరుపతి, తిరుమలలో అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలియజేశారు.
సంబంధిత కథనం