TTD Board Decisions : రూ.5258.68 కోట్ల బడ్జెట్ కు టీటీడీ ఆమోదం- పాలకమండలి కీలక నిర్ణయాలివే-tirumala tirupati devasthanams announces annual budget key highlights ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Board Decisions : రూ.5258.68 కోట్ల బడ్జెట్ కు టీటీడీ ఆమోదం- పాలకమండలి కీలక నిర్ణయాలివే

TTD Board Decisions : రూ.5258.68 కోట్ల బడ్జెట్ కు టీటీడీ ఆమోదం- పాలకమండలి కీలక నిర్ణయాలివే

TTD Board Decisions : తిరుమల శ్రీవారి భ‌క్తుల విజ్ఞప్తి మేర‌కు ఉద‌యం 5.30 గంట‌లకు బ్రేక్ ద‌ర్శనం స‌మ‌యం మార్చే అంశాన్ని పరిశీలించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతుల‌కు ఆఫ్‌లైన్‌ ద‌ర్శనం క‌ల్పించేందుకు సాధ్యాసాధ్యాలు ప‌రిశీలించాల‌ని నిర్ణయించింది.

రూ.5258.68 కోట్ల బడ్జెట్ కు టీటీడీ ఆమోదం- పాలకమండలి కీలక నిర్ణయాలివే

TTD Board Decisions : 2025- 26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,258.68 కోట్ల బడ్జెట్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని ఆయన తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో జె.శ్యామ‌ల‌రావుతో కలసి సోమ‌వారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

పోటు కార్మికుల‌కు మ‌రింత మెరుగైన వైద్య స‌హాయంతో పాటు జీతం పెంపుపై ప‌రిశీలించి చ‌ర్యలు తీసుకోవాల‌ని ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈవోను ఆదేశించారు. కొడంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, ఉప‌మాక‌, అన‌కాప‌ల్లె, క‌ర్నూలు, ధ‌ర్మవ‌రం, త‌ల‌కోన‌, తిరుప‌తి గంగమ్మ ఆల‌యాల పునః నిర్మాణానికి ఆర్థిక స‌హాయం అందించేందుకు ఆమోదించామన్నారు. శ్రీ‌వారి అన్నప్రసాదాల‌కు ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించిన‌ దాత‌ల డొనేష‌న్ పాసు బుక్కుల‌ను ర‌ద్దు చేయాల‌ని నిర్ణయించామన్నారు.

"తిరుమ‌ల‌లోని వీఐపీ, నాన్ వీఐపీ అతిథి గృహాలలో కొన్నింటిని తొల‌గించి పునః నిర్మాణం చేప‌ట్టేందుకు, మ‌రికొన్నింటిని ఆధునీక‌రించేందుకు నిర్ణయించాం. తిరుప‌తిలో అలిపిరి వ‌ద్ద సైన్స్ సిటీ, మ్యూజియం ఏర్పాటుకు గ‌తంలో కేటాయించిన 20 ఎక‌రాల భూమి ర‌ద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. తిరుమ‌ల‌లో లైసెన్స్ లేని హాక‌ర్స్‌ను గుర్తించి చ‌ర్యలు తీసుకోవాలని పాలకమండలి నిర్ణయించింది. వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతుల‌కు ఆఫ్‌లైన్‌లో శ్రీ‌వారి ద‌ర్శనం క‌ల్పించేందుకు సాధ్యాసాధ్యాలు ప‌రిశీలించాల‌ని నిర్ణయించాం" - టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

"భ‌క్తుల విజ్ఞప్తి మేర‌కు ఉద‌యం 5.30 గంట‌లకు శ్రీ‌వారి బ్రేక్ ద‌ర్శనం స‌మ‌యం మార్చే అంశాన్ని ప‌రిశీలించనున్నాం. టీటీడీ ఉద్యోగుల కుటుంబ స‌భ్యుల‌కు ప్రతి మూడు నెల‌ల‌కు ఒక‌సారి సుప‌థం ద్వారా ఆరు టికెట్లు మంజూరు చేయాల‌ని నిర్ణయం తీసుకున్నాం. టీటీడీ క‌ళాశాల‌లో గ‌త 25 సంవ‌త్సరాలుగా ప‌నిచేస్తున్న 151 మంది కాంట్రాక్ట్ లెక్చర‌ర్ల స‌మ‌స్యల ప‌రిష్కారానికి క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించాం. నూత‌న ఆగ‌మ స‌ల‌హామండ‌లి మండ‌లి ఏర్పాటుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. తిరుప‌తిలోని శ్రీ‌నివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి ప‌నుల‌కు రూ.కోటి మంజూరుకు ఆమోదం తెలిపాం" - టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం