Tirumala : ఆగస్టు 17న శ్రీవారి వాచీలు వేలం - భక్తులు ఇలా పాల్గొనొచ్చు
Tirumala Srivari Watches:భక్తులకు అలర్ట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారికి కానుకగా సమర్పించిన వాచీలను ఆగస్టు 17వ తేదీన వేలం వేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
Tirumala Srivari Watches Auction: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను వేలం వేయనుంది టీటీడీ. ఆగస్టు 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో హెచ్ఎంటి, సీకో, సిటిజన్, టైమ్స్, సోని, టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 14 లాట్లు వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయ వేళల్లో సంప్రదించాల్సి ఉంటుందని తిరులమ తిరుపతి దేవస్థానం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
రీఫండ్ ట్రాకర్…
Tirumala Tirupati Devasthanams: శ్రీవారి దర్శనార్థం విచ్చేసి గదులు పొందిన భక్తులకు ప్రస్తుతం రీఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా పంపుతున్నామని, త్వరలో రీఫండ్‌ను ట్రాక్ చేసేందుకు టీటీడీ వెబ్‌సెట్‌లో ట్రాక్‌ర్‌ను పొందుపరుస్తామని టీటీడీ తెలిపింది. స్పీడ్ పోస్టు చేసినపుడు ఏవిధంగా కవర్‌ను ట్రాక్ చేయవచ్చని పేర్కొంది. అదే తరహాలో రీఫండ్ సొమ్ము సమాచారాన్ని తెలుసుకోవచ్చన. తిరుమలలో యుపిఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన వెంటనే కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ చేయడం జరుగుతోందని వెల్లడించింది.
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 5 పనిదినాలలోపు వారి ఖాతాలకు కాషన్ డిపాజిట్ మొత్తం జమ చేస్తున్నామని టీటీడీ పేర్కొంది. ఈ సమాచారం ధ్రువీకరించుకోకుండా కొందరు భక్తులు కాల్ సెంటర్లకు ఫోన్లు చేసి, అధికారులకు మెయిళ్లు పంపుతున్నారని, భక్తులు తమ బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలించుకుని కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ కాకపోతేనే సంప్రదించాలని కోరింది. రీఫండ్ కోసం కొందరు భక్తులు సొమ్ము చెల్లించిన బ్యాంకును కాకుండా మరో బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తప్పుగా సరిచూసుకుంటున్నారని, ఎస్ఎంఎస్‌లో సూచించిన విధంగా 3 నుండి 5 రోజులు వేచి ఉండడం లేదని తెలిపింది. మరికొందరు టీటీడీ నిబంధనల ప్రకారం గది ఖాళీ చేయడం లేదని, వెరిఫికేషన్ కోడ్ సబ్‌మిట్ చేయకపోవడం, ఫొటో సరిపోలకపోవడంతో రీఫండ్ జనరేట్ కావడం లేదని స్పష్టం చేసింది.
శ్రీవారి పవిత్రోత్సవాలు :
ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయని ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.