Tirumala : తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు - 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు, ఇవిగో వివరాలు-tirumala srivari salakatla vasanthotsavams will be observed from april 10 to 12 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు - 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు, ఇవిగో వివరాలు

Tirumala : తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు - 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు, ఇవిగో వివరాలు

Tirumala Vasanthotsavalu 2025 : తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలపై టీటీడీ ప్రకటన చేసింది. ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు వసంతోత్సవాలు ఉంటాయని ప్రకటించింది. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు పలు సేవలు రద్దవుతాయని తెలిపింది.

తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన తెలిపింది.

శ్రీవారి వసంతోత్సవాలు - జరిగే కార్యక్రమాలు:

  • ఏప్రిల్ 10వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
  • ఏప్రిల్ 11న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.
  • ఏప్రిల్ 12న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.

వసంతోత్సవాల సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.

వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.

పలు సేవలు రద్దు…

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాన్ని పురస్కరించుకొని పలు సేవలను రద్దు చేశారు. ఏప్రిల్ 10న తిరుప్పావడ సేవ, ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

తుంబురుతీర్థ ముక్కోటి:

తిరుమలలో ఏప్రిల్ 12న శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం జరగనుంది. పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి.

ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తిప్రదాలు కలిగించేవి 7 తీర్థాలు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ తీర్థాలు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్ట్యం.

ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.