తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ అత్యంత వైభవంగా చేస్తారు. ఆరోజు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేసింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు సెప్టెంబర్ 27న తిరుమలకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు ఈ మేరకు వినతి చేసింది.