Tirumala Navaratri Brahmotsavam : అక్టోబర్ 15 నుంచి 23 వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
Tirumala Navaratri Brahmotsavam : అక్టోబర్ 15 నుంచి 23 వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమాన సేవలు నిర్వహిస్తారు.
Tirumala Navaratri Brahmotsavam : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా అక్టోబర్ 19న గరుడ వాహనం, 20న పుష్పకవిమానం, అక్టోబర్ 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.
అక్టోబర్ 14న అంకురార్పణం
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం అత్యంత ముఖ్యమైంది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. ఆ తరువాత అంకురార్పణం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అక్టోబర్ 15న బంగారు తిరుచ్చి ఉత్సవం
అక్టోబర్ 15 ఉదయం 9 గంటలకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
అక్టోబర్ 15న పెద్దశేషవాహన సేవ (రాత్రి 7 గంటలకు)
మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తారు.
అక్టోబర్ 16న చిన్నశేషవాహన సేవ (ఉదయం 8 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
అక్టోబర్ 16న హంస వాహన సేవ (రాత్రి 7 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు.
అక్టోబర్ 17న సింహ వాహన సేవ (ఉదయం 8 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం మలయప్పస్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది.
అక్టోబర్ 17న ముత్యపుపందిరి వాహన సేవ (రాత్రి 7 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
అక్టోబర్ 18న కల్పవృక్ష వాహన సేవ (ఉదయం 8 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
అక్టోబర్ 18న సర్వభూపాల వాహన సేవ (రాత్రి 7 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు.
అక్టోబర్ 19న మోహినీ అవతారం (ఉదయం 8 గంటలకు)
బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు.
అక్టోబర్ 19న గరుడ వాహన సేవ (రాత్రి 7 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తాడు.
అక్టోబర్ 20న హనుమంత వాహన సేవ (ఉదయం 8 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
అక్టోబర్ 20న పుష్పకవిమాన సేవ (సాయంత్రం 4 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పుష్పకవిమానం విహరిస్తారు. పుష్పక విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు.
అక్టోబర్ 20న గజవాహన సేవ (రాత్రి 7 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తారు.
అక్టోబర్ 21న సూర్యప్రభ వాహన సేవ (ఉదయం 8 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు.
అక్టోబర్ 21న చంద్రప్రభ వాహన సేవ (రాత్రి 7 గంటలకు)
శ్రీవారి బ్రహ్మో త్సవాల్లో 7వ రోజు రాత్రి మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం.
అక్టోబర్ 22న స్వర్ణరథం (ఉదయం 7.15 గంటలకు)
శ్రీవారి బ్రహ్మో త్సవాల్లో భాగంగా 8వ రోజు ఉదయం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది.
అక్టోబర్ 22న అశ్వవాహన సేవ (రాత్రి 7 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి మలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
అక్టోబర్ 23న చక్రస్నానం (ఉదయం 6 గంటలకు)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు.