శ్రీవారి దర్శనం అప్డేట్స్ - తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..?-tirumala srivari darshanam updates devotees are waiting in 21 compartments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  శ్రీవారి దర్శనం అప్డేట్స్ - తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..?

శ్రీవారి దర్శనం అప్డేట్స్ - తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..?

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా కొనసాగుతోంది. వేసవిసెలవులు రావటంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఎలాంటి టికెట్లు, టోకెన్లు లేని సామాన్య భక్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.

తిరుమల

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావటంతో భక్తుల రద్దీ స్వల్పంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనం కోసం 21 కంఫార్ట్ మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నట్లు టీటీడీ పేర్కొంది.

10 నుంచి 12 గంటల సమయం!

ఎలాంటి టికెట్లు, టోకెన్లు లేని సామాన్య భక్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. ఇక శనివారం తిరుమల శ్రీవారిని 85,078 భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 35,791 మంది భక్తులు తలనీలాలను సమర్పించగా… హుండీ కానుకలు రూ. 2.67 కోట్లుగా ఉంది.

వసంతోత్సవాలకు అంకురార్పణ:

మరోవైపు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో వసంతోత్సవాలకు శ‌నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఇవాళ్టి (మే 11) నుంచి మే 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.

ఈ ఉత్స‌వాల్లో భాగంగా మూడు రోజుల పాటు మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేప‌డ‌తారు. అలాగే రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. మే 12వ తేదీ ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.