తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి చక్రస్నానం.. చూసిన కనులదే భాగ్యం!-tirumala srivari brahmotsavam 2025 chakrasnanam performed to chakradhari ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి చక్రస్నానం.. చూసిన కనులదే భాగ్యం!

తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి చక్రస్నానం.. చూసిన కనులదే భాగ్యం!

Anand Sai HT Telugu

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అంగరంగ వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. నేటితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

శ్రీవారి చక్రస్నానం

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి రోజునకు చేరుకున్నాయి. ఇవాళ్టితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటలకు వేడుకగా పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం జరిగింది. అనంతరం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య శ్రీదేవి భూదేవి, చక్రత్తాళ్వార్ సమేతంగా ఉన్న మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించారు.

వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించారు. గోవిందా.. గోవిందా అని భక్తి పారవశ్యంతో శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు పవిత్ర అభిషేకాన్ని వీక్షించడానికి టీటీడీ పుష్కరిణి మండపానికి నాలుగు వైపులా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది. ఆలయ నాలుగు మాడవీధుల్లో 23, పుష్కరిణిలో 4, మొత్తం 27 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసింది.

భక్తుల సౌకర్యం కోసం, అవసరమైన సమచారం ఇచ్చేందుకు పుష్కరిణి సమీపంలోని రథం వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది టీటీడీ.

భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించడానికి, తిరిగి వెళ్లడానికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు అధికారులు. పుష్కరిణిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా గజ ఈతగాళ్లను, బోట్లను అందుబాటులో ఉంచుంది టీటీడీ. చక్రస్నానం సందర్భంగా 1000 మంది పోలీలు, 1300 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఎన్‌డీఆర్ఎఫ్, ఫైర్, స్విమ్మింగ్ తదితర విభాగాల నుంచి 140 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.

అంతేకాకుండా ఇరువైపులా 200 మంది సేవకులు భక్తులకు సేవలను అందించారు. మరో 100 మంది సేవకులు పుష్కరిణి సీటింగ్ ప్రాంతాలలో ఉదయం 4 గంటల నుండి వేచి ఉన్న యాత్రికులకు బాదం పాలు పంపిణీ చేశారు. చక్రస్నానం కార్యకలాపాలను పర్యవేక్షించడానికి నియమించిన అధికారులను తెల్లవారుజామున 3 గంటల నుండి విధుల్లోనే ఉన్నారు.

పుష్కరిణి దగ్గర పురుషులు, మహిళా యాత్రికుల కోసం తాత్కాలిక దుస్తులు మార్చుకునే గదులను కూడా కేటాయించారు. చక్రస్నానం రోజున పవిత్ర ఘడియలు రోజంతా ఉంటాయి కాబట్టి.. భక్తులు దశలవారీగా, ఓపికగా పవిత్ర స్నానాలు చేయాలని టీటీడీ కోరింది. ఈ విషయాన్ని టీటీడీ రేడియో, ప్రసార విభాగం నిరంతరం ప్రకటిస్తోంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.