సెప్టెంబర్ 24 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు - అదేరోజు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ-tirumala srivari brahmotsavalu to start from september 24 to october 2 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  సెప్టెంబర్ 24 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు - అదేరోజు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

సెప్టెంబర్ 24 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు - అదేరోజు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు.. సెప్టెంబర్ 24వ తేదీనే పట్టు వస్త్రాలను సమర్పిస్తారని ఈవో వెల్లడించారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలారావు… అధికారులతో కలిసి సోమవారం సాయంత్రం అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుుకన్నారు.

తొలిరోజే పట్టు వస్త్రాల సమర్పణ…

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 24న బ్రహ్మోత్సవాల తొలి రోజు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. సెప్టెంబర్ 28న గరుడ సేవ, అక్టోబర్ 2వ తేదీన చక్రస్నానం ఉంటుందని టీటీడీ ఈవో తెలిపారు. రద్దీ నిర్వహణకు రద్దీని ముందుగా అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు.

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహన రాకపోకలను అంచనా వేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకోవాలని ఈవో నిర్ణయించారు. ఎక్కువమంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆలయంలో, గ్యాలరీల్లో, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జిల్లా పోలీసులతో సమన్వయంతో భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. తిరుమలలో పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం.

ఆలయ కైంకర్యాలు, వాహనసేవలు, ఇంజినీరింగ్ పనులు, వసతి గృహాలు, కల్యాణకట్ట, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, గార్డెన్ విభాగం అలంకరణలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు 2025 - ముఖ్య తేదీలు

• 16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.

• 23-09-2025 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

• 24-09-2025 ధ్వజారోహణం.

• 28-09-2025 గరుడ వాహనం.

• 01-10-2025 రథోత్సవం.

• 02-10-2025 చక్రస్నానం.

ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు ఉండనున్నాయి. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దవుతాయి.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 27-09-2025 రాత్రి 9 నుంచి 29-09-2025 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరించాలని టీటీడీ అధికారులు నిర్ణయించన సంగతి తెలిసిందే. భక్తుల రద్దీకి తగినవిధంగా లడ్డూలు నిల్వ ఉంచుకునేలా కూడా చర్యలు చేపట్టారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం