తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన బుధవారం ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.
తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైందని టీటీడీ తెలిపింది. ’రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే ’ అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయని వెల్లడించింది. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.
రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉందని టీటీడీ తెలిపింది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగిందని పేర్కొంది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు అని, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో – స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుందని వెల్లడించింది.
బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన అక్టోబర్ 2వ తేదీ జరుగనున్న చక్రస్నానం సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో ఏర్పాట్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.., భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెలుపలికి వెళ్లేందుకు వీలుగా గేట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీసులు సమిష్టిగా సమన్వయం చేసుకుని భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తామని తెలిపారు.
చక్రస్నానం సందర్భంగా 1,000 మంది పోలీసులు, 1300 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఫైర్, తదితర విభాగాల నుండి 140 మందితో పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈవో. పుష్కరిణిలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఈతగాళ్లను, బోటును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చక్రస్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు.