Tirumala : రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి... శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు 5 నెలలు వాయిదా..-tirumala rathasaptami arrangements sreevari temple gold plating works will be delayed says ttd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tirumala Rathasaptami Arrangements Sreevari Temple Gold Plating Works Will Be Delayed Says Ttd

Tirumala : రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి... శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులు 5 నెలలు వాయిదా..

HT Telugu Desk HT Telugu
Jan 27, 2023 03:05 PM IST

Tirumala : తిరుమలలో జనవరి 28న జరుగనున్న రథసప్తమి పర్వదినానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 5 : 30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు మొదలవుతాయని తెలిపింది. మరోవైపు.. తిరుమల శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను ఐదు నుంచి ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నామని, త్వరలో మరో తేదీ నిర్ణయిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను ఐదు నుంచి ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నామని, త్వరలో మరో తేదీ నిర్ణయిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి ఛైర్మన్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోందని చెప్పారు. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నామని, ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

తిరుమలలో శనివారం జరుగనున్న రథసప్తమి పర్వదినానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. ఉదయం 5 : 30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు మొదలవుతాయని తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవలు జరుగుతాయన్నారు. వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌, పిఎసి-2, 4, వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అన్నప్రసాద వితరణతోపాటు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, టి, కాఫి, పాలు, మజ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయ మాడవీధుల్లో భద్రతా ఏర్పాట్లను టీటీడీ సివిఎస్వో నరసింహకిషోర్‌, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వాహన మండపం, మాడ వీధుల్లోని గ్యాలరీలు, అన్నప్రసాదాల పంపిణీ కోసం చేపట్టిన ప్రవేశమార్గాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి విజిలెన్స్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో లభించే దర్శన టికెట్లు, సేవాటికెట్ల బుకింగ్‌ తో పాటు టీటీడీకి సంబంధించిన సమస్త సమాచారం నిక్షిప్తం చేసిన మొబైల్ అప్లికేషన్‌ను ఛైర్మన్‌ సుబ్బారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటిడి దేవస్థానం పేరుతో రూపొందించిన మొబైల్‌ యాప్‌ను వైవి.సుబ్బారెడ్డి తిరుమల అన్నమయ్య భవనంలో ప్రారంభించారు. భక్తుల కోసం ఇప్పటివరకు గోవింద మొబైల్‌ యాప్‌ ఉండేదని, దీన్ని మరింత ఆధునికీకరించి నూతన యాప్‌ను రూపొందించామని తెలిపారు. మొబైల్‌ యాప్‌ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవచ్చన్నారు. విరాళాలు కూడా ఇదే యాప్‌ నుండి అందించవచ్చన్నారు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని, ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా ఈ యాప్‌ ద్వారా చూడవచ్చన్నారు.

తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్‌లో ఉందని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జియో సంస్థ సహకారంతో టిటిడి ఐటి విభాగం ఈ యాప్‌ను రూపొందించినట్టు వివరించారు. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్‌ ద్వారా క్లౌడ్‌ టెక్నాలజిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్‌ చేసుకోగలుగుతున్నారని వివరించారు. నూతన యాప్‌ సేవలపై భక్తుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించి అవసరమైతే మరిన్ని పొందుపరుస్తామని చెప్పారు.

WhatsApp channel