Telugu News  /  Andhra Pradesh  /  Tirumala Malayappa As Nartana Krishna Rides Atop A Chandra Prabha Vahanam
బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనంపై శ్రీవారు
బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనంపై శ్రీవారు

Tirumala Brahmotsavam : చంద్రప్రభ వాహ‌నంపై న శ్రీ మ‌ల‌య‌ప్ప

04 October 2022, 6:38 ISTB.S.Chandra
04 October 2022, 6:38 IST

Tirumala Brahmotsavam శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో సోమవారం రాత్రి చంద్రప్రభ వాహ‌నంపై నర్తనకృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై విహరించిన స్వామి వారు సాయంత్రం చంద్ర ప్రభ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు.

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ మలయప్పస్వామి నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్త జన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

చంద్ర‌ప్రభ వాహనం – సకలతాపహరం

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం ఉదయం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ మలయప్పస్వామివారు మత్స్య నారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

<p>బ్రహ్మోత్సవాల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి</p>
బ్రహ్మోత్సవాల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి

సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్య‌ప్రాప్తి

బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు.

ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

వాహనసేవలో పెద్దజీయర్ స్వామి, చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల‌ వాహనసేవల్లో భ‌క్తుల‌కు క‌నుల‌విందుగా అపురూప‌మైన కళారూపాలు ప్ర‌ద‌ర్శిస్తున్నామ‌ని టిటిడి ధార్మిక ప్రాజెక్టుల అధికారి విజ‌య‌ల‌క్ష్మి చెప్పారు. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరితో పాటు ఉత్తరాదికి చెందిన మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వివిధ కళారూపాలను క‌ళాకారులు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని, గ్యాల‌రీల్లో వేచి ఉన్న భ‌క్తుల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌ని తెలిపారు.

ఆయా రాష్ట్రాల జాన‌ప‌ద క‌ళారూపాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చామ‌న్నారు. వాహ‌న‌సేవ‌ల స‌మ‌యంలో విశిష్ట‌త‌ను తెలియ‌జేసేందుకు ప్ర‌ముఖ పండితులతో వ్యాఖ్యానం చేయిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు, శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల వాహ‌న‌సేవ‌ల‌తోపాటు తిరుమ‌ల, తిరుప‌తిలోని ప‌లు వేదిక‌ల‌పై ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు.

91 క‌ళాబృందాల్లో 1906 మంది క‌ళాకారులు

వాహ‌న సేవ‌ల్లో హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ నుండి 52, దాస సాహిత్య ప్రాజెక్టు నుండి 25, అన్న‌మాచార్య ప్రాజెక్టు నుండి 14 క‌లిపి మొత్తం 91 క‌ళాబృందాల్లో 1906 మంది క‌ళాకారులు పాల్గొన్నార‌ని వివ‌రించారు. ఆంధ్రప్రదేశ్ నుండి 63 బృందాల్లో క‌ళాకారులు పాల్గొన్నార‌ని, వీరు గరగల భజన, చెక్క భజన, పిల్లన గ్రోవి భజన, తప్పెట గుళ్లు, లంబాడీ నృత్యం, కోలాటం, కీలుగుర్రాలు, బళ్లారి డప్పులు, వేష‌ధార‌ణ‌ క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించార‌ని తెలియ‌జేశారు.

తెలంగాణ నుండి రెండు బృందాలు చెక్క భజన, కోలాటం ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పారు. క‌ర్ణాట‌క నుండి ఐదు బృందాలు విచ్చేసి మహిళా తమటే, డొల్లు కునిత‌, పూజ కునిత, సోమన కునిత, కంసాల‌ కళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించార‌ని తెలిపారు. త‌మిళ‌నాడు నుండి 12 బృందాలు వ‌చ్చాయ‌ని, వీరు కరకట్టం, పంపై, ఒయిలాట్టం, పోయికల్ కుత్తిరై, మాయిలాటం, కాళియాట్టం, కోలాటం, మహారాష్ట్ర నుండి రెండు బృందాలు డిండి భజన, డ్రమ్స్ వాయిద్యం, ఒడిశా నుండి ఒక‌ బృందం, కేరళ నుండి ఒక‌ బృందం, పాండిచ్చేరి నుండి రెండు బృందాలు స్థానిక క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించార‌ని వివ‌రించారు.