Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం, నలుగురి అరెస్ట్!
Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నలుగురుని సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఏఆర్ డెయిరీ, పరాగ్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థలకు చెందిన నలుగురిని మూడ్రోజులగా విచారించిన సీబీఐ ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.

Tirumala Laddu Row : తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నెయ్యి సరఫరా చేసిన నలుగురు వ్యక్తులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరాగ్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థలకు చెందిన పలువురిని గత మూడు రోజులుగా సీబీఐ తిరుపతిలో విచారిస్తోంది.
కల్తీ నెయ్యి-కీలక దశకు విచారణ
విచారణకు సహకరించకపోవడం, కల్తీ నెయ్యి ఘటనలో ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో నలుగురిని సీబీఐ ఇవాళ అదుపులోకి తీసుకుంది. అయితే ఈ విషయాన్ని దర్యాప్తు అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగంపై సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. శ్రీవారి లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతు సంబంధిత పదార్థాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యవహరంపై సీబీఐతో విచారణ జరపాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. గతేడాది నవంబర్‌లో ఏర్పాటైన ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం పలు దఫాలుగా విచారణ చేపట్టింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుమల, తిరుపతితో పాటు నెయ్యి సరఫరాదారులైన తమిళనాడు దుండిగల్ కు చెందిన ఏఆర్ డైయిరీలో విచారణ నిర్వహించారు. మూడు రోజులుగా దర్యాప్తు బృందం సభ్యుడు సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు తిరుపతిలో దర్యాప్తు చేపట్టారు.
సీబీఐ అదుపులో నలుగురు
నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్న ఏఆర్ డైయిరీ పలు అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ బృందం గుర్తించింది. తమ ఉత్పత్తి సామర్థ్యానికి మించి పెద్ద మొత్తంలో నెయ్యి సరఫరా చేసేందుకు ఉత్తరాదికి చెందిన పలు డైయిరీ సంస్థల నుంచి నెయ్యి కొనుగోలు చేసినట్లు సీబీఐ బృందం గుర్తించారు. ఏఆర్ డైయిరీకి సహకరించిన ఆయా సంస్థల సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించింది. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, పరాగ్ డైయిరీ, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, ఏఆర్ డైయిరీకి సంబంధించిన విపిన్ గుప్త, పోమిల్ జైన్, అపూర్వ చావడ, రాజశేఖర్‌లను తాజాగా సీబీఐ అదుపులోకి తీసుకుంది. సోమవారం వీరిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని సమాచారం.
సంబంధిత కథనం