Tirumala facial recognition :నేటి నుంచి తిరుమలలో ముఖ గుర్తింపు…అమలుపై సందేహాలు-tirumala facial recognition will be implemented from march 1st onwards ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Facial Recognition :నేటి నుంచి తిరుమలలో ముఖ గుర్తింపు…అమలుపై సందేహాలు

Tirumala facial recognition :నేటి నుంచి తిరుమలలో ముఖ గుర్తింపు…అమలుపై సందేహాలు

HT Telugu Desk HT Telugu

Tirumala facial recognition తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల కేటాయింపు, లడ్డూ ప్రసారాదాల విక్రయాలలో ఫేషియల్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విధానం విజయవంతం అయితే పూర్తి స్థాయిలో అమలు చేయాలని టీటీడీ యోచిస్తోంది. శ్రీ వారి దర్శనాలకు ఫేషియల్ గుర్తింపు అమలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతోంది.

నేటి నుంచి తిరుమలలో ఫేషియల్ రికగ్నేజేషన్

Tirumala facial recognition తిరుమలలో నేటి నుంచి ముఖ గుర్తింపు విధానంతో శ్రీవారి సేవలు మొదలు కానున్నాయి. శ్రీవారి దర్శనం, గదుల కేటాయింపు, లడ్డూ ప్రసాదం తదితర అంశాల్లో మరింత పారదర్శకత తెచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపు.. కాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్లలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు చేయనుంది.

మార్చి 1 నుంచి టీటీడీ ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించ నుంది. తిరుమలలోని గదుల కేటాయింపు కేంద్రాల వద్ద ప్రయోగాత్మకంగా కెమెరాలతో ఈ సాంకేతికతను పరిశీలించారు. ఖాళీ చేసే సమయంలోనూ గదులు పొందినవారే వచ్చి మరోమారు ఫేస్‌ రికగ్నేషన్‌ చేస్తే కాషన్‌ డిపాజిట్‌ తిరిగి చెల్లిస్తారు. తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు కౌంటర్లు, కాషన్‌ డిపాజిట్‌ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లో టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఈ సాంకేతికత సాయంతో లడ్డూలు ఇస్తారు.

ప్రస్తుతం గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ప్రస్తుతం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇందు కోసం ఆధునికి టెక్నాలజీ కలిగిన కెమెరాలను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఒకే వ్యక్తి ఎక్కువ గదులు తీసుకోవడానికి వీలుండదు. ఈ విధానం వల్ల పారదర్శకంగా భక్తలకు సేవలు అందించవచ్చని టీటీడీ భావిస్తోంది. ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం లోటు పాట్లను పరిగణలోకి తీసుకుని, పూర్తి స్థాయిలో అమలు చేస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

ముఖగుర్తింపుపై అనుమానాలు….

ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో ఓ భక్తుడు నెలలో ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించే పేరుతో భక్తుల రాకను నియంత్రిస్తున్నారనే విమర‌్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం తిరుమలలో భక్తులు పొందే ప్రతి సేవకు ఆధార్‌ తప్పనిసరి చేశారు. తిరుమలలో లభించే ప్రతి సేవకు, శ్రీవారి దర్శనానికి లడ్డూ ప్రసాదాల విక్రయాలకు, గదులను అద్దెకు తీసుకోడానికి ఆధార్ తప్పనిసరి చేశారు.

ఆధార్ ద్వారా భక్తులు ఎన్ని లడ్డులు కొనుగోలు చేశారు, ఎన్నిసార్లు తిరుమల కొండకు వస్తున్నారు, ఎన్నిసార్లు గదులు అద్దెకు తీసుకుంటున్నారనేది ఖచ్చితమైన లెక్కలు లభిస్తాయని టీటీడీ భావించింది. కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

గతంలో గదుల్ని అద్దెకు తీసుకోడానికి కుటుంబం మొత్తంలో ఒక్కరి ఆధార్ కార్డు సరిపోయేదని, ఆధార్ కార్డు తీసుకెళ్లిన వ్యక్తి వేలిముద్ర, ఫోటో ద్వారా గదులు కేటాయించేవారు. కొత్త విధానంలో తిరుమల పర్యటనకు వెళ్లిన కుటుంబంలోని ప్రతి ఒక్కరు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. వారి ఫోటోను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. శ్రీవారి సర్వదర్శనానికి కూాడా కుటుంబ సభ్యులంతా వేలిముద్ర వేసి ఫోటో దిగాల్సి ఉంటుంది. దీని వల్ల క్యూలైన్లలో రద్దీ పెరుగుతుందనే అనుమానాలున్నాయి. వృద్ధులు, చిన్నపిల్లలు కూడా క్యూలైన్లలో పడిగాపులు తప్పవు.

నిత్యం 70-80వేల మందికి ఫేషియల్ రికగ్నిషన్ అమలు చేయడానికి పెద్ద ఎత్తున మానవ వనరుల్ని వినియోగించాల్సి వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆధార్ ద్వారా సులువుగా వివరాలు నమోదవుతున్నా కొత్తగా ఫేషియల్ రికగ్నైజేషన్ అమలు చేయాలనే ఆసక్తికి కారణమేమిటనే చర్చ కూడా లేకపోలేదు. వివిఐపిలు పొందే ఆర్జిత సేవలు, గదులకు పదేళ్లకు పైగా ఫేషియల్ రికగ్నైజేషన్ అమలు చేస్తున్నారు. మరోవైపు విఐపిలకు నెలలో ఎన్నిసార్లైన దర్శనాలు చేసుకునే వెసులు బాటు ఉంది. సామాన్య భక్తులకు మాత్రం నెలలో ఒక్కసారి మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.