Tirumala Updates : శ్రీవారి భక్తులకు గమనిక, ఫిబ్రవరి 12న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ
Tirumala Updates : తిరుమలలో ఫిబ్రవరి 12న పౌర్ణమి గరుడ వాహన సేవ నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్రతినెలా పౌర్ణమి రోజున టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Tirumala Updates : తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12న పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్రతినెలా పౌర్ణమి రోజున టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రానున్న బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి భక్తుల కోసం గరుడ వాహన సేవను ఎస్వీబీసీ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఫిబ్రవరి 12న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
తిరుమల దివ్య క్షేత్రంలో ఫిబ్రవరి 12న బుధవారం శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా జరుగనుంది. పురాణాలపరంగా తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయని చెబుతారు. అయితే ఈ పుణ్యతీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థము, కూమారధార తీర్థము, తుంబురు తీర్థము, శ్రీరామకృష్ణ తీర్థము, ఆకాశగంగ తీర్థము, పాపవినాశన తీర్థము, పాండవ తీర్థము అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానం చేసిన భక్తులు ముక్తి మార్గం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రతి ఏటా మకరమాసంలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుణ్యతీర్థం స్వామివారి ఆలయానికి 6 మైళ్ల దూరంలో ఉంది. పౌర్ణమినాడు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినంను ఆలయ ఆర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్కంద పురాణం ప్రకారం పూర్వకాలమున శ్రీరామకృష్ణుడను మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడని చెబుతుంటారు.
ఈ పర్వదినంనాడు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామాగ్రిని తీసుకు వెళ్లి శ్రీరామకృష్ణ తీర్థంలోని శ్రీరామచంద్ర మూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. దీంతో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ముగియనుంది.
ఫిబ్రవరి 13న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 18 నుంచి 26వ తేదీ వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 6.30 నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
సంబంధిత కథనం