Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శనానికి రెండు నెలల ముందుగా టీటీడీ టికెట్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసింది. జూన్ నెల కోటాకు సంబంధించి వివిధ సేవలు, దర్శనం, వసతి టికెట్లు మార్చి 18 నుంచి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఆర్జిత సేవల టోకెన్లను విడుదల చేశారు. రేపు(మార్చి 24న) ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు, వసతి గదులు టికెట్లు విడుదల చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు.
మార్చి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు. శ్రీవారి భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ లేదా టీటీడీ దేవస్థానం యాప్ లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 30న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 25వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. మార్చి 25న ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు.
ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 24వ తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేయడమైనది.
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్‌డ్ బియ్యం టెండర్ కమ్ వేలం ఏప్రిల్ 10న తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో జరగనుంది. మొత్తం 12,320 కిలోల బియ్యం వేలానికి సిద్ధంగా ఉంచారు. దీనికి సంబంధించి రూ.590 డీడీ తీసి టెండర్ షెడ్యూల్ పొందవచ్చు. వేలంలో పాల్గొనేందుకు రూ.25,000 ఈఎండీగా చెల్లించాలి. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని ఫోన్ నెంబర్ 0877-2264429, సదరు నంబర్ తో కార్యాలయం వేళల్లో లేదా టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org సంప్రదించవచ్చు.
సంబంధిత కథనం