Tirumala : నిండిన 5 జలాశయాలు... తిరుమలకు ఏడాదికి సరిపడా తాగునీళ్లు
Rains in Andhrapradesh:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని 5 ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఏడాదికి సరిపడా తాగునీళ్లు అందుతాయని టీటీడీ అధికారులు అంచనా వేశారు.

Rains in Andhrapradesh: నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి కూడా నీటిని తీసుకుంటారు. తిరుమలలో కేవలం 24 గంటల్లోనే 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
సోమవారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం ఐదు జలాశయాల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ నీటిమట్టాలు తిరుమలకు దాదాపు 250 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయి.
నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.
1) పాపవినాశనం డ్యామ్ :- 693.60 మీ.
FRL :- 697.14 మీ.
2)గోగర్భం డ్యామ్ :- 2887′ 00″
FRL :- 2894′ 0″
3) ఆకాశగంగ డ్యామ్ :- 859.80మీ
FRL :- 865.00మీ
4)కుమారధార డ్యామ్ :- 896.20మీ
FRL :- 898.24మీ
5)పసుపుధార డ్యామ్ :- 895.90మీ
FRL :- 898.28మీ
తిరుపతిలో గత రెండు రోజులుగా మైచాంగ్ తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా కపిలతీర్థంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భక్తుల భద్రత దృష్ట్యా, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు పుష్కరిణి నీటిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల అనుమతిని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది.
నీటి విడుదలపై సమీక్ష
తిరుమలలో నిండిన జలాశయాలను మంగళవారం ఛైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా ఛైర్మన్ భూమన మాట్లాడుతూ… 15 రోజుల క్రితం తిరుమల, తిరుపతిలలో నీటి కొరత ఎక్కువగా ఉన్నదని, దీనిని అధిగమించడానికి కండలేరు రిజర్వాయర్ నుండి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించామన్నారు. నవంబరు 23వ తేదీ శ్రీవారి పాదాల చెంత అలిపిరిలోని సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభించినట్లు తెలిపారు. ఆ రోజు నుండే స్వామివారి అనుగ్రహంతో తిరుమల, తిరుపతిలలో ప్రారంభమైన వర్షాలు, గత రెండు రోజుల్లో 24 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు.
టీటీడీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి డ్యాంల నుండి నీటిని విడుదల చేస్తారన్నారు. ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుఝామున గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగ డ్యామ్ గేట్లను అధికారులు తెరచి నీటిని బయటకు వదిలినట్లు వివరించారు.