తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఇకపై ఉదయం నుండి రాత్రి వరకు వడలు వడ్డింపు-tirumala annam prasada kendra to serve vadas all day ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఇకపై ఉదయం నుండి రాత్రి వరకు వడలు వడ్డింపు

తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఇకపై ఉదయం నుండి రాత్రి వరకు వడలు వడ్డింపు

HT Telugu Desk HT Telugu

తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదం అందించడమే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఇకపై ఉదయం నుంచి రాత్రి వరకు వడలను వడ్డించనున్నారు.

అన్నప్రసాదంలో భాగంగా వడలు వడ్డిస్తున్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమలలో భక్తులకు నాణ్యతతో కూడిన రుచికరమైన అన్నప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్నప్రసాద కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాకుండా, రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వడలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేపట్టింది.

ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో స్వామి అమ్మవార్ల చిత్రపటం వద్ద వడలను‌ ఉంచి టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు పూజ నిర్వహించారు.

ఆనంతరం ఆయన స్వయంగా భక్తులకు వడలు వడ్డించారు. ఈ సందర్భంగా అన్నప్రసాదం, వడ రుచిపై ఆరా తీయగా, చాలా రుచికరంగా ఉందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత భక్తులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించడంలో భాగంగా మధ్యాహ్న భోజన సమయంలో ఇప్పటికే వడల వడ్డిస్తున్నప్పటికీ, ఆదివారం నుండి రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వడలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ప్రస్తుతం రోజుకు సుమారు 70 వేల నుండి 75 వేల వడలను ప్రత్యేకంగా తయారు చేసి భక్తులకు వడ్డిస్తున్నారని చెప్పారు. శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, సోంపు వంటి పదార్థాలతో రుచికరమైన వడలను తయారు చేస్తున్నామని తెలిపారు. భోజనం నాణ్యతను మెరుగుపర్చే దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని చైర్మన్ పేర్కొన్నారు.

ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాదంలో భక్తులకు వడలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, డిప్యూటీ ఈవో రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.