Tiruchanur Pavitrotsavam : సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు, పలు సేవలు రద్దు
Tiruchanur Pavitrotsavam : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు మూడ్రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మూడ్రోజులు కల్యాణోత్సవరం, బ్రేక్ దర్శనాలు, ఊంజల్ సేవ రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
Tiruchanur Pavitrotsavam : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు రోజులు కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఈ ఉత్సవాలకు సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరగనుంది.
ఆలయంలో భక్తుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మూడు రోజుల కార్యక్రమాలు
ఈ సందర్భంగా సెప్టెంబరు 16న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. రూ.750 చెల్లించి ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. భక్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.
పలు సేవలు రద్దు
పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 15వ తేదీన అంకురార్పణ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 16వ తేదీ అష్టదళ పాద పద్మారాధన సేవలను రద్దు చేశారు. ఆదేవిధంగా సెప్టెంబరు 16, 17, 18వ తేదీలలో కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవను టీటీడీ రద్దు చేసింది.
సెప్టెంబరు 10న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
పద్మావతి అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 10వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 10 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతిస్తారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం