CM Chandrababu : ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా స్వచ్ఛమైన గ్యాస్, త్వరలో 99 లక్షల కుటుంబాలకు సరఫరా- సీఎం చంద్రబాబు
CM Chandrababu : 24 గంటలు గ్యాస్ సరఫరా అయ్యేలా, నేరుగా పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరాను సీఎం చంద్రబాబు ఆదివారం ప్రారంభించారు. భవిష్యత్‌లో ఏపీ నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
CM Chandrababu : "నాడు దీపం 1 ద్వారా ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. నేడు దీపం 2 ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. మరొక్క అడుగు ముందుకు వేసి, 24 గంటలు గ్యాస్ సరఫరా అయ్యేలా, నేరుగా పైప్ లైన్ ద్వారా నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రారంభించాం" అని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుచానూరులో ఇంటింటికి నేచురల్ గ్యాస్ సరఫరాను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం తిరుచానూరులో ఓ వినియోగదారుడి ఇంట్లో స్టవ్ వెలిగించి టీ పెట్టారు. పైప్‌లైన్ గ్యాస్, సిలిండర్ గ్యాస్ మధ్య తేడాలను వినియోగదారుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాణిజ్య వాహనాలు, ఆటో రిక్షాలు, సీఎన్జీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా
ఏపీ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుతుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. భవిష్యత్‌లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని స్పష్టం చేశారు. తిరుచానూరులో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ పథకం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీ వల్ల అనేక ఉపయోగాలున్నాయన్నారు. రాష్ట్రంలో 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. హైవేలు, సముద్రతీరం, పోర్టులు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు 5 కంపెనీలను సంప్రదించామన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కోసం పనిచేస్తున్నామని సీఎం వివరించారు.
రాయలసీమలో
ఏజీ&పీ... 'థింక్ గ్యాస్' పేరిట కింద పైపుల ద్వారా గృహాలు, పరిశ్రమలకు నేరుగా నేచురల్ గ్యాస్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మద్దతుతో తిరుపతితో పాటు రాయలసీమలోని మరో మూడు జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు 25 సంవత్సరాల లైసెన్స్ పొందింది. ఈ సంస్థ గృహ వినియోగదారులు, పారిశ్రామిక యూనిట్లు, వాహన యజమానులకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) సరఫరా చేస్తుంది.
డీపీఎన్డీ పర్యావరణ అనుకూలమైంది. అలాగే తక్కువ ఖర్చుతో ఎల్పీజీకి ప్రత్యామ్నాయం. ఎల్పీజీ సిలిండర్ల మాదిరిగా కాకుండా, డీపీఎన్జీ పైప్‌లైన్‌ల ద్వారా ప్రతి ఇంటికి నేరుగా గ్యాస్ సరఫరా చేస్తారు. ఎల్పీజీతో పోలిస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి. వినియోగదారులకు సురక్షితమైన, అనుకూలమైన గ్యాస్ సరఫరా చేయొచ్చని నిర్వాహికులు అంటున్నారు.
నారావారి పల్లెకు సీఎం చంద్రబాబు
తిరుపతి పర్యటన పూర్తిచేసుకున్న సీఎం చంద్రబాబు....తన స్వగ్రామమైన నారావారిపల్లెకు బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామంలో సీఎం చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరితోపాటు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రాహ్మణి, మనవుడు దేవాన్ష్ నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఇప్పటికే నారా వారి పల్లెకు చేరుకున్నారు.
సంబంధిత కథనం