AP Cock Fights: కోడి పందేల‌కు వేళైంది...ఒక్కో పందెం ఏకంగా రూ.10 నుంచి రూ.25 ల‌క్ష‌లు... బ‌రుల చుట్టూ కంచెలు, బౌన్స‌ర్లు-time for cockfighting in ap each bet costs anywhere from rs 10 to rs 25 lakh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cock Fights: కోడి పందేల‌కు వేళైంది...ఒక్కో పందెం ఏకంగా రూ.10 నుంచి రూ.25 ల‌క్ష‌లు... బ‌రుల చుట్టూ కంచెలు, బౌన్స‌ర్లు

AP Cock Fights: కోడి పందేల‌కు వేళైంది...ఒక్కో పందెం ఏకంగా రూ.10 నుంచి రూ.25 ల‌క్ష‌లు... బ‌రుల చుట్టూ కంచెలు, బౌన్స‌ర్లు

HT Telugu Desk HT Telugu
Jan 13, 2025 09:27 AM IST

AP Cock Fights: సంక్రాంతి పండ‌గ వ‌చ్చిందంటే వెంట‌నే గుర్తుకొచ్చేది కోడి పందేలు. కోడి పందేల‌కు వేళ అయింది. ఏకంగా ఒక్కో పందెం రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. ఇప్ప‌టికే కోడి పందేల కోసం భారీ స్థాయిలో బ‌రుల‌ను ఏర్పాటు చేశారు.

గోదావరి జిల్లాల్లో కోడి పందాలు షురూ..
గోదావరి జిల్లాల్లో కోడి పందాలు షురూ..

AP Cock Fights: కోస్తా జిల్లాల్లో కోడి పందెలు మొదలయ్యాయి. బ‌రుల చుట్టూ ఇన‌ప కంచెలు, బౌన్స‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. రాజ‌కీయ నేత‌లు, వారి బంధువులు స్వయంగా పందాల నిర్వహణలోకి దిగుతున్నారు. భోగి రోజు నుంచి నాలుగైదు రోజుల పాటు ప‌గ‌లు, రాత్రి అని తేడా లేకుండా నిరాటంకంగా పందేలు జ‌రుగుతాయి.

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఒక్కో మండ‌లంలో స‌గ‌టున ప‌ది భారీ బ‌రుల‌ను కోడి పందేల కోసం సిద్ధం చేశారు. ల‌క్ష‌కు పైగా కోడి పుంజులు బ‌రిలో దిగుతాయి. కోడి పందేల నిషేధంపై రాష్ట్ర హైకోర్టు ఉత్త‌ర్వులు ఉన్నాయి. దీంతో కోడి పందేల కోసం ఏర్పాటు చేసిన బ‌రుల‌ను ధ్వంసం చేస్తూ పోలీసులు హడావుడి చేశారు. కానీ పందెం కోడి మాత్రం కాలుదువ్వుతోంది.

ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ప‌లు ప్రాంతాల్లో భారీ స్థాయిలో బ‌రులు సిద్ధం అయ్యాయి. పందేలు వ‌ద్దంటూ ప్ర‌తి ఏటా పోలీసులు ముందు హ‌డావుడి చేస్తారు. ఆ త‌రువాత మామూలై పోయి కోడి పందేల జ‌ర‌గ‌డంతో కోట్లలో చేతులు మారుతుండ‌టం రివాజ‌పోయింది. కోడి పందేలు, పేకాట‌, గుండాట ఇత‌ర జూద క్రీడ‌ల‌తో దాదాపు రూ.1,500 కోట్లు చేతులు మారుతుంది. అయితే ఇందులో అగ్ర‌భాగం కోడి పందేల వ‌ల్లే చేతులు మారుతుంది.

రోజు (వారం), దిశ‌, కోడి జాతి ఆధారంగా పందేల‌కు సిద్ధం అవుతున్నారు. కాకి, పింగ‌ళ‌, డేగ‌, నెమ‌లి జాతి పుంజుల‌ను ఏ రోర‌జు ఏ స‌మ‌యంలో బ‌రిలోకి దింపాలో ముహుర్తాలు పెట్టించుకున్నారు. వాటిని సామాజిక మాధ్య‌మ గ్రూపుల్లో పందేగాళ్లకు పంపారు. గోదావ‌రి జిల్లాల్లో ఎక్క‌డ ఏ స్థాయిలో పందేలు జ‌రుగుతాయో స‌మ‌చారాన్ని సామాజిక మాధ్య‌మాల్లో కూడా పంచుకుంటారు. ఉభ‌య ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో భారీ బ‌రుల‌ను ఏర్పాటు చేశారు. త‌ణ‌కు, ఆచంట వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భారీ బ‌రుల్లో ఒక్కో పందెం ఏకంగా రూ.25 లక్ష‌ల‌పై మాటే ఉంటుంది.

ఉభ‌య తూర్పు గోదావ‌రి జిల్లాలోనే అతి పెద్ద బ‌రి ఐ.పోల‌వ‌రం మండ‌లం ముర‌మ‌ళ్ల‌లో ఏర్పాటు అయింది. అక్క‌డ ఒక్కో పందెం త‌క్కువులో త‌క్కువ రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల‌ వ‌ర‌కు ఉంటుందని నిర్వ‌హ‌కులు చెబుతున్నారు. బ‌రి చుట్టూ ఇన‌ప కంచె, బౌన్స‌ర్లు, డ్రోన్‌, సీసీ కెమెరాల‌తో ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేశారు. వ‌చ్చేవారు చూసేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఏకంగా ఈ కోడి పందేళ్ల‌లో పాల్గొనేందుకు వీఐపీ, వీవీఐపీ పాస్‌ల‌ను కూడా సిద్ధం చేశారు. ఆ పాస్‌లుంటేనే అక్క‌డికి అనుమ‌తి ఇస్తారు. పోలీసులు హ‌డావుడి చేసిన‌ప్ప‌టికీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్ర‌జా ప్ర‌తినిధులే రంగంలోకి దిగ‌డంతో ఈసారి కూడా కోడి పందేలు జోరుగా సాగ‌నున్నాయి.

తూర్పు గోదావ‌రి జిల్లాలో ముర‌మ‌ళ్ల‌, కాట్రేనికోన‌, వేట్ల‌పాలెం, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో భీమ‌వ‌రం, వెంప, సీస‌లి, దుంప‌గ‌డ‌ప ప్రాంతాలు కోడి పందేల‌కు పేరు పొందాయి. అయితే ఇవి కాకుండా ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కోడిపందేలా జ‌రుగుతున్నాయి. కాకి, నెమ‌లి, డేగ‌, ప‌చ్చ‌కాకి, కేతువ వంటి జాతి కోళ్లు పందేల్లో కాలు దువ్వ‌నున్నాయి. కొన్ని వంద‌ల ప్రాంతాల్లో కోడి పందేలు జ‌రుగుతాయి. వీటిలో భారీ బ‌రుల్లో ఒక్కో పందెం ల‌క్షల్లో ఉండ‌గా, చిన్న బ‌రుల్లో ఒక్కో పందెం రూ.50 వేల నుంచి ఉంటుంది.

ఓడిన కోడి మాంసం కూడా గిరాకే

కోడి పందేలు ఆడేవారి కంటే ఓడిన కోడి మాంసం కోసం ఎదురుచూసేవారే ఎక్కువ‌. పందెం కోడి చ‌చ్చినా, బ‌తికినా రూ. వేల‌ల్లో ప‌లుకుతుంది. చ‌చ్చే వ‌ర‌కు పోరాడి త‌మ య‌జ‌మానికి రూ.ల‌క్ష‌ల్లో ఆదాయాన్ని తెచ్చిపెట్టే పందెం కోడి చ‌చ్చిన త‌రువాత కూడా రూ.వేల‌ల్లో ఆదాయాన్ని తెస్తుంది. పందెం రాయుల్లు త‌మ బంధువులకు, రాజ‌కీయ నాయ‌కుల‌కు, అధికారుల‌కు పండ‌గ గిఫ్ట్‌గా కోస మాంసం (ఓడిన కోడి) పంపిస్తుంటారు. కోడి పందేల బ‌రుల ద‌గ్గ‌రా కోస‌ల‌ను కాల్చి మాంసం చేసే దుకాణాలు కూడా వెలిశాయి.

భోగి నాడు ప్రారంభ‌మైన కోడిపందేల్లోనే వంద‌ల కోళ్లు పందెంలో పాల్గొంటాయి. దీంతో వంద‌ల కిలోల కోస మాంసం వ‌స్తోంది. కోస మాంసం గ‌తేడాది కిలో దాదాపు రూ.1,000 వ‌ర‌కు ప‌లికింది. ఈ ఏడాది మ‌రింత ధ‌ర పెర‌గొచ్చ‌ని నిర్వ‌హ‌కులు చెబుతున్నారు. పందెంలో ఓడిన కోడిని ఎక్కువ‌గా దెబ్బ‌తిన‌క‌పోతే మ‌ళ్లీమ‌ళ్లీ బ‌రిలోకి దింపుతారు. అదే పందెంలో గెలిచినప్ప‌టికీ తీవ్రంగా గాయాలైన కోడిని మ‌ళ్లీ బ‌రిలోకి దింప‌రు. దాన్ని కూడా కోసం మాంసానికే అమ్మేస్తారు. అలాంటి కోడి ధ‌ర మ‌రింత ఎక్కువ ఉంటుంది. ఒక్కో కోడి ధ‌ర దాదాపు రూ.5 వేల‌కు ప‌లుకుతుంది. ఈ కోళ్ల‌లో కొవ్వులేకుండా రుచిగా, బ‌ల‌వ‌ర్ధ‌కంగా ఉంటుండ‌డంతో ఎక్కువ మంది ఈ మాంసానికి ఎగ‌బ‌డ‌తారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner