AP Aided Schools : ఎయిడెడ్ పాఠశాలలపై ఫోకస్ - తేలనున్న అసలు లెక్కలు, త్రీమెన్ కమిటీలు ఏర్పాటు
ఎయిడెడ్ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య పరిశీలనకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేసింది. తద్వారా ఎయిడెడ్ యాజమాన్యాల లెక్కలు బయటికి రానున్నాయి. 40 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను మూసివేసే అవకాశం ఉంది.

రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయిల్లోనూ, మండల స్థాయిల్లోనూ త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేసింది. దీంతో ఎయిడెడ్ యాజమాన్యాల లెక్కలు బట్టబయలు కానున్నాయి. 40 కంటే ఎక్కువ మంది విద్యార్థులు లేని ఎయిడెడ్ పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏకంగా ఆ పాఠశాలను మూసేసి, విద్యార్థులను ఏప్రిల్ 23లోపు సమీప పాఠశాల్లో చేర్పించాలని నిర్ణయం తీసుకుంది.
595 ఎయిడెడ్ పాఠశాలలు….
రాష్ట్రంలో ప్రస్తుతం 595 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. 3,010 మంది ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో పని చేస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో యూడైస్ లెక్కల ప్రకారం ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేస్తారు. అక్కడ పని చేసే వారికి ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుంది. ఈ క్రమంలో కొన్ని ఎయిడెడ్ యాజమాన్యాలు క్షేత్రస్థాయిలో అధికారులను మచ్చిక చేసుకుని తప్పుడు లెక్కలు చూపుతున్నాయనే విమర్శలు వస్తోన్నాయి.
త్రీమెన్ కమిటీలు….
ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్ విద్యార్థుల సంఖ్య పరిశీలనకు జిల్లా, మండల స్థాయిల్లో త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ త్రీమెన్ కమిటీలో జిల్లా డిప్యూటీ విద్యాశాఖ అధికారి (డిప్యూటీ డీఈవో), మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో), పాఠశాల సీనియర్ ప్రధానోపాధ్యాయుడు ఉంటారు. ఈ కమిటీలు ఆయా జిల్లాల్లో, ఆయా మండలాల్లో ఉన్న ఎయిడెడ్ పాఠశాలలను పరిశీలిస్తాయి. ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశ రిజిస్టర్లు, విద్యార్థుల రికార్డులను ఒకటికి రెండు సార్లు త్రీమెన్ కమిటీ పరిశీలించనుంది. దీంతో ఎయిడెడ్ యాజమాన్యాల లెక్కల్లో నిజాలు బట్టబయలు అవుతాయి.
ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలని గత మూడేళ్లుగా ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడటం లేదు. ఈ నేపథ్యంలో…. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎయిడెడ్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్య డైరెక్టరేట్ ఆదేశించింది. 40 మందిలోపు విద్యార్థులున్న ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యాలకు తుది నోటీసులు జారీ చేయాలని విద్యా శాఖ కమిషనర్, జిల్లా విద్యా శాఖ అధికారులు (డీఈవోల)కు ఆదేశించారు. గత మూడేళ్లుగా ఆ సంఖ్య పెరగకపోగా , తగ్గుతుండటంతో మూసివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు తుది నోటీసు ఇవ్వనుంది. అనంతరం ఆయా పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 23లోపు వాటిని మూసివేసి విద్యార్థులను సమీప పాఠశాల్లో చేర్చాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరం యూడైస్ ఆధారంగా 40 కంటే ఎక్కువ మంది విద్యార్థులను ఉంచుకోలేని ఎయిడెడ్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాంటి స్కూళ్లపై ఇప్పటికే చర్యలు తీసుకుని ఉంటే, నివేదిక పంపాలని కోరింది.
త్రీమెన్ కమిటీ ఇచ్చే సమాచారం ఆధారంగా జిల్లా అధికారులు పాఠశాలలు, మండలాలు, జిల్లాల వారీగా వాస్తవ హాజరు నమోదు ఎంత అనేది నిర్ధారించి రాష్ట్ర పాఠశాల విద్యా డైరెక్టరేట్‌కు నివేదిక అందిస్తారు. రాష్ట్రంలో ఉన్న 595 ఎయిడెడ్ పాఠశాల్లో 40 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లు 126 ఉన్నాయని ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కలు సూచిస్తున్నాయి. పూర్తిగా విద్యార్థులే లేకుండా 80 స్కూళ్లు కొనసాగుతున్నాయి. అయితే త్రీమెన్ కమిటీ పరిశీలన తరువాత ఈ పాఠశాలలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం