Alluri District : ఘాట్ రోడ్డులో వ్యాన్ బోల్తా - ముగ్గురు యువకులు దుర్మరణం-three youths were killed in a van overturned in alluri sitharama raju district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Alluri District : ఘాట్ రోడ్డులో వ్యాన్ బోల్తా - ముగ్గురు యువకులు దుర్మరణం

Alluri District : ఘాట్ రోడ్డులో వ్యాన్ బోల్తా - ముగ్గురు యువకులు దుర్మరణం

HT Telugu Desk HT Telugu
Jun 13, 2024 08:25 PM IST

Andhrapradesh Crime News : అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వ్యాన్ అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో ముగ్గురు దుర్మణం చెందారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.

అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం
అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

Andhrapradesh Crime News : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాడేరుకు 20 కిలోమీటర్ల దూరంలోని ఘాట్ రోడ్డులో మలకపొలం జంక్షన్ సమీపంలో వ్యాన్ బోల్తా పడి ముగ్గురు యువకుకు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.‌ మృతులు, క్షతగాత్రులు అందరూ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన వారిగా గుర్తించారు

అసలేం జరిగింది?

పెదబయలు మండల కేంద్రంలో మోదకొండమ్మ పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన ఏస్ఏస్వీ సౌండ్స్ నుంచి డీజే సౌండ్ సిస్టమ్, స్టేజ్ సామగ్రి తీసుకెళ్లి, కార్యక్రమం ముగియడంతో తిరిగి వస్తున్న సందర్భంలో వారు ప్రయాణించే వ్యాన్ అదుపు తప్పి ఘాట్ రోడ్డు సైడ్ వాల్ వద్ద బోల్తా పడింది.

దీంతో అందులో ఉన్న 12 మంది ప్రయాణికులు స్టేజీ సామగ్రితో సహా తుళ్లి లోయలోకి పడిపోయారు. ఈ ప్రమాదంలో హరీష్ (23), అశోక్ (22), లక్ష్మణ్ (20) మృతి చెందారు. సునీత, నితిన్, సేనాపతి గణేష్, భీముని రవి, సూర్య దీక్షిత, పేయ్యల భారతి, చందక రాజు, కంకిపూడి పవన్, రోహిత్ కుమార్, మోహన్, లంక శ్రీనులు తీవ్రంగా గాయపడ్డారు.

వీరిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆసుపత్రిని‌ సందర్శించి, క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

కోనసీమ జిల్లాలో దారుణం:

అంబేద్కర్ కోనసీమ జిల్లా అయి‌నవిల్లి మండలంలోని ఓ గ్రామంలో 12 ఏళ్ల బాలికపై 46 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికకు తండ్రి లేడని, తల్లి ఉపాధి నిమిత్తం అరబ్ దేశాలకు వెళ్లింది. అమ్మమ్మ ఇంటి వద్దే ఆ బాలిక ఉంటుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సీఐ ప్రశాంత్, ఎస్ఐ రాజేష్ ఆ గ్రామానికి చేరుకుని బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

విషం తాగి అమ్మకు ఫోన్, ఆసుపత్రిలో మృతి

ఒక యువతి విషం తాగి మృతి చెందిన ఘటన రాజమండ్రిలోని ప్రకాష్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా పోలవరం మండలం తోటగుంది గ్రామానికి చెందిన యువతి (21) బీఎస్సీ చదివింది.

స్నేహితురాలి పెళ్లికని తల్లికి చెప్పి వెళ్లింది. దాదాపు ఐదు రోజుల తరువాత ఆ తల్లి ఫోన్ చేసి "నేను రాజమండ్రి బస్ స్టాండులో ఉన్నా. విషం తాగాను" అని చెప్పింది. దీన్ని గమనించిన స్థానికులు ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిందని సీఐ సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసి‌ విచారణ జరుపుతున్నామని అన్నారు.

మరోవైపు రాజమండ్రికి సమీపంలో లాలా చెరువు స్పిన్నింగ్ మిల్ కాలనీకి చెందిన శ్రీరామచంద్రమూర్తి (31) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నేషనల్ హైవేకి ఆనుకుని శ్రీరామపురానికి వెళ్లే మార్గంలో నిర్మానుష్యమంగా ఉన్న ప్రాంతంలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారని సీఐ ఉమర్ తెలిపారు. దీనిపై ఎస్ఐ అంకారావు కేసు నమోదు చేశారు. మృతుడు నగరంలో ద్విచక్ర వాహన షోరూంలో పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.

రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.

WhatsApp channel