Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం,వ్యవసాయ పనులకు వెళుతుండగా ప్రమాదం, ముగ్గురు మహిళల దుర్మరణం
Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాకోడూరు-బుడంపాడు మధ్య వ్యవసాయ పనుల కోసం వెళుతున్న మహిళల్ని ఆటో ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాకోడూరు-బుడం పాడు గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. వ్యవసాయ పనుల కోసం ఆటోలో వెళుతున్న మహిళలు ప్రమాదానికి గురయ్యారు. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు-నారా కోడూరు మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా వాటిని నివారించే చర్యలు మాత్రం జరగడం లేదు. గుంటూరు బాపట్ల, గుంటూరు-నిజాంపట్నం మార్గాలు అత్యంత ప్రమాదకరంగా ఉంటున్నా వాటిని బాగు చేయడం లేదు.
ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిని సుద్దపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్టుగా క్షతగాత్రులు ఆస్పత్రిలో పోలీసులకు సమాచారం అందించారు.
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు మహిళలు మృతి బాధాకరమని, కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి జీజీహెచ్ లో మెరుగైన వైద్యసేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ముఖ్యమంత్రి సంతాపం…
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గరు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీపనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.