ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు జడ్జీలు రానున్నాయి. వీరిలో జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ దొనాడి రమేశ్, జస్టిస్ సుభేందు సామంత ఉన్నారు. వీరు వేర్వురు కోర్టుల్లో పని చేస్తుండగా… వీరి బదిలీకి సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. ఇందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు.
గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ రమేశ్ ఏపీ హైకోర్టుకు రానున్నారు. ఇక కోల్‌కతా హైకోర్టు నుంచి జస్టిస్ సుభేందు సామంత బదిలీ అవ్వనున్నారు. ఈ ముగ్గురి రాకతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుతుంది. సుప్రీంకోర్టు కొలీజియం ఆగస్టు 25న సమావేశమై ఈ ముగ్గురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
జస్టిస్ దొనడి రమేష్ ది చిత్తూరు జిల్లాలోని మదనపల్లె సమీపంలోని కమ్మపల్లి. తిరుపతిలోనిశ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 1987–90 కాలంలో వి.ఆర్. లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు.1990లో ఏపీ బార్ కౌన్సిల్‌లో అడ్వొకేట్ గా ఎన్ రోల్ చేసుకున్నారు. 2000 డిసెంబర్ నుంచి 2004 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు. 2020 జనవరి 13న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2023 జూలై 24న అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ది విజయనగరం జిల్లాలోని పార్వతీపురం. విశాఖపట్నంలోని ఎం.వి.పి. లా కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. 1988లో ఏపీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. కొన్నేళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
1988 నుంచి 2002 వరకు 14 ఏళ్ల పాటు పార్వతీపురం, విజయనగరంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ వారి కుటుంబంలో మూడో తరం న్యాయవాది. ఆయన తాత చీకటి పరశురాం నాయుడు ప్రసిద్ధ న్యాయవాది, రాజనీతిజు్ఞడు. 2002లో జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికైన జస్టిస్ రాయ్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల విధులు నిర్వర్తించారు. 2019లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023లో గుజరాత్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు. తాజాగా మళ్లీ ఏపీ హైకోర్టుకు రానున్నారు.