AP weather Updates: రుతుపవనాలు ఆలస్యంతో ఏపీలో మరో మూడు రోజులు ఎండలు-three more days of sunshine in ap due to delay of monsoon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Three More Days Of Sunshine In Ap Due To Delay Of Monsoon

AP weather Updates: రుతుపవనాలు ఆలస్యంతో ఏపీలో మరో మూడు రోజులు ఎండలు

HT Telugu Desk HT Telugu
Jun 06, 2023 09:48 AM IST

AP weather Updates: ఏపీలో మరో మూడు రోజులు ఎండలు మండిపోనున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

మండుతున్న ఎండలు
మండుతున్న ఎండలు

AP weather Updates: రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఏపీలో మరో మూడు రోజులు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది విశాఖ‌పట్నం వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మంగళవారం అల్లూరి జిల్లా నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్రవడగాల్పులు ఉంటాయని ప్రకటించారు. రాష్ట్రంలోని మరో 212 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. వడగాల్పులు, పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం ఏన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 43.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా శ్రీరామవరంలో 43.1°C, అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

మంగళవారం అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39°C - 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

ఊరిస్తున్న నైరుతి…

మరోవైపు రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు ఊరిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనాలను రుతుపవనాలు తలకిందులు చేస్తున్నాయి. ఏటా సాధారణంగా జూన్‌ 1వ తేదీకల్లా నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది ఆలస్యంగా జూన్‌ 4 నాటికి కేరళను తాకుతాయని ఐఎండీ తొలుత అంచనా వేసింది. మొదటి వారం గడిచినా 'నైరుతి' కేరళను తాకకుండా దోబూచులాడుతూనే ఉంది. వాస్తవానికి రుతుపవనాలు అండమాన్‌ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి మే 20-22 మధ్య ప్రవేశిస్తాయి.

ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో అండమాన్‌ నికోబార్‌ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలతో పాటు పరిసర ప్రాంతాలకు విస్తరిస్తాయని ఐఎండి చెబుతోంది. అక్కడ నుంచి జూన్‌ 1వ తేదీకి కేరళను తాకుతాయి. ఈ ఏడాది అండమాన్‌ సముద్రంలోకి సకాలంలో అంటే మే 20 నాటికే ప్రవేశించాయి. అప్పటినుంచి వాటి విస్తరణలో మాత్రం మంద గమనం చోటుచేసుకుంటోంది.

రుతుపవనాల మెల్లగా కదులుతుండటంతో అవి కేరళలో ప్రవేశించడానికి జాప్యం జరుగుతోంది. ఐఎండీ ముందుగా ఊహించినట్టుగా జూన్‌ 4వ తేదీ కంటే మరో నాలుగైదు రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నాయి. సాధారణం కంటే వారం రోజుల ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించనున్నాయి.

నైరుతి రుతుపవనాల ఆగమనంలో జాప్యానికి గత నెలలో సంభవించిన 'మోచా' తుపాను, ఉత్తరాదిన ఏర్పడిన పశ్చిమ ఆటంకాలు ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత నెల 9న బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుపాను ఆ తర్వాత అత్యంత తీవ్ర తుపానుగా మారి 15న బంగ్లాదేశ్, మయన్మార్‌ల మధ్య తీరాన్ని దాటింది. దీంతో తుపాను బంగాళాఖాతంలోని తేమను మయన్మార్‌ వైపు లాక్కెళ్లిపోయింది.

మరోవైపు కొద్దిరోజుల నుంచి ఉత్తరాదిన వెస్టర్న్‌ డిస్టర్బెన్స్‌లు చురుగ్గా ప్రభావం చూపిస్తున్నాయి. ఇవి దిగువన బంగాళాఖాతంపై ఉన్న తూర్పు గాలులను బలహీన పరిచాయి. ఫలితంగా అండమాన్‌ సముద్రంలో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు విస్తరించడకుండా వెస్టర్న్‌ డిస్టర్బెన్స్‌ అడ్డుపడుతున్నాయి.

రుతుపవనాల రాక ఆలస్యం కానుండటంతో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు మరికొన్నాళ్లు కొనసాగనున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశానికి మరో 10 రోజులు పట్టవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటివరకు పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2-4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయి. అప్పుడప్పుడూ వడగాడ్పులకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

IPL_Entry_Point