కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతిచెందిన వారంతా రాజమండ్రి అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మృతులను రాజమండ్రికి చెందిన హజరత్ వాలీ, గెడ్డం రామరాజు, తణుకుకు చెందిన వరాడ సుధీర్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ గోనా శివశంకర్, వెంకట సుబ్బారావును చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన సమావేశానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.
ఆగిఉన్న లారీ విశాఖపట్నం నుంచి మండపేటకు ఐరన్ లోడ్‌తో వెళ్తోంది. దాన్ని గమనించకుండా దాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురి మృతిచెందడంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలోనూ రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం రూరల్ మండలంలోని జాతీయ రహదారిలో నీలం జూట్ మిల్ దగ్గర ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సుతో సహా నాలుగు లారీలు ధ్వంసమయ్యారు.
ట్రావెల్స్ బస్సు బరంపురం నుంచి శ్రీకాకుళం వెళ్తుంది. ఈ క్రమంలో ట్రావెల్ బస్సును ఓ గ్రానైట్ లారీ ఢీట్టింది. వెనకాలే ఉన్న మరో గ్రానైట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. సడన్ బ్రేక్ కారణంగా వెనుకనున్న లారీ క్యాబిన్‌పై ఓ గ్రానైట్ బ్లాక్ పడింది. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుని డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనలో మొత్తంగా బస్సుతో సహా నాలుగు లారీలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో ట్రాఫిక్ జామ్ అయింది.
సంబంధిత కథనం