Nellore Tragedy : నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
Nellore Tragedy : నెల్లూరు జిల్లాలో విషాదం జరిగింది. ఇంటర్ పరీక్షలు రాసి సరదాగా గడుపుదామనుకున్న స్నేహితులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లా మనబోలు మండలం వడ్లపూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపురం మండలం ఊటుకూరుకు చెందిన వరుణ్ కుమార్ (17), అదసనపల్లి నందకిశోర్ (18) స్నేహితులు. వరుణ్‌కుమార్ ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి, సరదాగా గడుపుదామనుకుని వారం రోజుల కిందట గొట్లపాలెంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. అమ్మమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులతో పాటు తన స్నేహితులతో కబుర్లు, సరదాలతో గడుపుతున్నాడు. శనివారం అదే ఊరుకు చెందిన స్నేహితుడు నందకిశోర్ ద్విచక్ర వాహనంపై వరుణ్ వద్దకు వెళ్లాడు.
అదుపు తప్పి.. ఆటోను ఢీకొట్టి..
ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై గొట్లపాలెంలోని సిద్ధు అనే మరో స్నేహితుడి వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి వడ్లపూడికి వెళ్లి తిరిగి వస్తున్నారు. వచ్చే క్రమంలో గేదె అడ్డురావడతో దాన్ని తప్పించే క్రమంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి అటుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో వరుణ్ కుమార్, నందకిశోర్ అక్కడికక్కడే మృతి చెందారు.
చికిత్స పొందుతూ..
పొదలకూరు మండలం లింగంపల్లికి చెందిన తురకా సరేంద్ర (36) ఆటో డ్రైవర్‌గా పని చేసుకుంటూ వడ్లపూడిలో నివాసం ఉంటున్నారు. ఆటో డ్రైవర్ నరేంద్రకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను పొదలకూరు సీహెచ్‌సీకి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేటికే ప్రాణాలు వదిలారు. దీంతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ముగ్గురికి గాయాలు..
వరుణ్ కుమార్, నందకిశోర్ స్నేహితుడు సిద్ధూతో పాటు.. ఆటోలో ప్రయాణిస్తున్న మణి, శ్రీనివాసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు మృతదేహాలను పరిశీలించి, స్థానికులకు అడిగి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాకేష్ తెలిపారు.
4 గ్రామాల్లో విషాదఛాయలు..
ఈ ఘటనతో ఊటుకూరు, గొట్లపాలెం, వడ్లపూడి, లింగంపల్లి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరుణ్ కుమార్ మరణ వార్త తెలుసుకున్న అమ్మమ్మ, తాతయ్యతో పాటు తండ్రి వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని విగతజీవిగా పడిఉన్న మనవుడిని చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. మంచి ప్రయోజకుడు అవుతాడనుకున్న కుమారుడు అర్థాంతరంగా తనువుచాలించడాన్ని చూసి తండ్రి రోదించాడు.
బంధువుల రోదనలు..
తమ్ముడి మరణవార్త విన్న నందకిశోర్ అన్న ఈశ్వర్ స్నేహితులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నాడు. సోదరుడి మృతదేహంపై పడి రోస్తూ లే నందా ఇంటికి వెళ్దామని పిలవడం అందరినీ కంటతడి పెట్టించింది. ఆటో డ్రైవర్ నరేంద్ర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని సమాచారం అందుకున్న ఆయన భార్య, ఇద్దరు పిల్లలు అక్కడికి చేరుకున్నారు. తమకు దిక్కెవరంటూ వారు విలపించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)