Pawan Kalyan : పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్-రంగంలోకి హోంమంత్రి, డీజీపీ
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ పేషీకి బెదిరింపు కాల్స్, అభ్యంతరమైన మెసేజ్ లు వచ్చాయని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ ను చంపేస్తామని ఆయన పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో మెసేజ్ వచ్చాయని అధికారులు తెలిపారు. బెదిరింపు కాల్స్, మెసేజ్ ల విషయాన్ని అధికారులు పవన్ కల్యాణ్, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడంపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత డీజీపీ ద్వారక తిరుమలరావుతో మాట్లాడారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పవన్ కల్యాణ్ పేషీకి రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని డీజీపీ హోంమంత్రికి తెలిపారు.
డిప్యూటీ పవన్ కల్యాణ్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్‌పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. ఫోన్ కాల్స్, మెసేజ్ ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యల వెనక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు. హోంమంత్రి ఆదేశాలతో బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఓ భారీ షిప్ లో తరలిస్తున్న రే,న్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ ఘటనల అనంతరం పవన్ కు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేసే అవకాశం ఉంది.
నాగబాబుకు మంత్రి పదవి?
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడనున్నట్లు సమాచారం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు... పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తారు. ఇటీవల ఎన్నికల్లో నాగబాబు ఎంపీగా పోటీ చేయాలని భావించినా పొత్తుల్లో పోటీ సాధ్యపడలేదు. దీంతో ఆయనను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వగా...జనసేన నుంచి నాగబాబు పేరు వినిపించింది. అయితే నాగబాబు రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధంగా లేకపోవడంతో...ఆయనకు మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏపీలో అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మందిని మంత్రులుగా నియమించవచ్చు. ప్రస్తుత కేబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన జనసేన మూడు మంత్రి పదవులు తీసుకుంది. ఆ పార్టీ నుంచి పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ మంత్రులుగా ఉన్నారు. పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. మిగిలిన ఒక్క మంత్రి పదవిని తాజాగా జనసేన నుంచి ఖరారు చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగబాబును కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సంబంధిత కథనం