SocialMedia War: వైసీపీ కార్యకర్తలపై కేసుల నమోదుపై జగన్ రియాక్షన్ ఇదే.. ప్రైవేట్‌ కేసులు, పరామర్శలకు సిద్ధం..-this is jagans reaction on registration of cases against activists private cases prepare for hearings ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Socialmedia War: వైసీపీ కార్యకర్తలపై కేసుల నమోదుపై జగన్ రియాక్షన్ ఇదే.. ప్రైవేట్‌ కేసులు, పరామర్శలకు సిద్ధం..

SocialMedia War: వైసీపీ కార్యకర్తలపై కేసుల నమోదుపై జగన్ రియాక్షన్ ఇదే.. ప్రైవేట్‌ కేసులు, పరామర్శలకు సిద్ధం..

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 12, 2024 09:20 AM IST

SocialMedia War: ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై వరుస కేసులు నమోదు అవుతుండటంతో ఆ పార్టీ అలర్ట్‌ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేస్తుండటం, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారిపై కేసులు నమోదు చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో కలవరం నెలకొంది.

సోషల్ మీడయా కార్యకర్తలకు అండగా నిలవాలని భావిస్తోన్న జగన్ (ఫైల్ ఫోటో)
సోషల్ మీడయా కార్యకర్తలకు అండగా నిలవాలని భావిస్తోన్న జగన్ (ఫైల్ ఫోటో)

SocialMedia War: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై కేసులు నమోదు అవుతుండటంతో వైసీపీ అలర్ట్‌ అయ్యింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన నెలరోజుల్లోనే వైసీపీ సోషల్ మీడియా బృందాలను యాక్టివేట్ చేసుకుేంది. అధికారంలో ఉన్న సమయంలో ఐపాక్‌ బృందాలు సోషల్ మీడియా కంటెంట్‌ తయారీలో భాగస్వాములుగా ఉండేవి. దాంతో పాటు వైసీసీ సోషల్‌ మీడియా కార్యకర్తలు కూడా జిల్లా, మండల స్థాయి వరకు ఉన్నారు. పార్టీ అభిమానుల్లో యువకులు, ఉత్సాహవంతుల్ని గుర్తించి వారికి సోషల్ మీడియా ప్రచారానికి వినియోగించుకున్నారు.

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా పలు విమర్శలు వచ్చాయి. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పలువురిపై సీబీఐ కేసులు కూడా నమోదు చేసింది. ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగిపోయింది. వైసీపీ అధికారానికి దూరమైన తర్వాత కొద్ది రోజులకే ఆ పార్టీ సోషల్ మీడియా టీమ్స్‌ యాక్టివేట్ అయ్యాయి.

ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ విమర్శలతో ఆ పార్టీ ఎక్స్‌, ఫేస్‌ బుక్‌ ప్లాట్‌‌ఫామ్‌లపై కూటమి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో వైసీపలో యాక్టివ్‌‌గా ఉండే వారిని గుర్తిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య దూషణలకు పాల్పడిన ఖాతాలను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తిస్తున్నారు. వీరిలో చాలామంది పాత ఖాతాలను, పోస్టులను డిలీట్ చేసినా వారిని పోలీసులు గుర్తిస్తున్నారు.

ఇక పొలిటికల్‌ కంటెంట్‌ను వాట్సాప్‌ గ్రూపుల్లో క్షేత్రస్థాయికి చేరుతున్నట్టు గుర్తించిన పోలీసులు వాట్సాప్‌లో కంటెంట్‌ షేర్‌ చేసే వారిని కూడా నోటీసులు ఇస్తున్నారు. తీవ్ర స్థాయి ఆరోపణలు ఉన్నవారు, వ్యక్తిగత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

100కుపైగా కేసులు నమోదు..

గత పదిరోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా కేసులు నమోదు అయ్యాయి. జగన్‌ రాజకీయ ప్రత్యర్థులపై అసభ్య దూషణలతో విరుచుకుపడే ఖాతాలను పోలీసులు గుర్తిస్తున్నారు. ట్రోల్‌ చేసే హ్యాండిల్స్‌ను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కీలకంగా ఉండే వారిని పోలీసులు గుర్తించారు. వారిపై పలు ప్రాంతాల్లో ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు.

వైసీపీ సోషల్‌ మీడియా బృందాలను లీడ్‌ చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తుండటంపై ఆ పార్టీ అధ్యక్షుడు కూడా దృష్టి సారించినట్టు పార్టీ వర్గాలుచెబుతున్నాయి. సోషల్ మీడియా కార్యకర్తల్ని కాపాడుకోడానికి లీగల్ టీమ్స్‌ను సిద్దం చేస్తున్నట్టు చెబుతున్నారు. సోషల్ మీడియా వ్యవహారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కూడా బాధితుడేనని, జగన్‌ కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం జరుగుతున్నా పోలీసులు కట్టడి చేయడం లేదని, ఆర్గనైజ్డ్‌‌గా ఈ వ్యవహారం సాగుతోందని వైసీపీ భావిస్తోంది.

వైసీపీ క్యాడర్‌ను, కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేయడానికే కొద్దిమందిపై వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసి మిగిలిన వారిని అణిచి వేసే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ భావిస్తోంది. కేసులు ఎదుర్కొంటున్న వారికి న్యాయ సహాయం అందించడంతో పాటు జైళ్లకు వెళ్లిన వారిని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అండగా ఉంటామని చెబుతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ స్వయంగా కొంతమందిని పరామర్శిస్తారని చెబుతున్నారు. సోషల్ మీడియా బృందాల్లో స్థైర్యం నింపడంతో పాటు వారిని ప్రోత్సహించడానికి ఏమి చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

వైసీపీ కార్యకర్తలపై చేస్తున్న అభియోగాలు, ఆరోపణలు అధికార కూటమి పార్టీల సోషల్ మీడియా విభాగాలు కూడా చేస్తున్నాయని వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి సతీమణితో పాటు ఇతర ముఖ్య నాయకులను కించపరిచేలా జరుగుతున్న దుష్ప్రచారంపై ప్రైవేట్ కేసులు వేయాలని భావిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం, టీడీపీ, జనసేన పార్టీల నుంచి జరుగుతున్న డిజిటల్ దుష్ప్రచారాలపై న్యాయపోరాటం చేయాలని వైసీపీ భావిస్తోంది. సోషల్ మీడియా కేసుల్లో అరెస్టై జైళ్లకు వెళ్లే వారికి భరోసా కల్పించేలా చర్యలు ఉంటాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Whats_app_banner