Rules for Bhavani Deekshalu: అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ బెజవాడ దుర్గమ్మను భక్తిశ్రద్దలతో కొలిచే భక్తులు మండలం రోజుల పాటు దీక్షలు చేపట్టడం 45ఏళ్ల క్రితం ప్రారంభమైంది. మొదట్లో కొద్ది మంది భక్తులతో ప్రారంభమైన ఈ దీక్షలు ప్రస్తుతం ఏటా లక్షలాదిమంది చేపడుతుంటారు.
ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఉత్తరాంధ్ర భక్తులు లక్షలాది ఈ దీక్షలు చేపడతుంటారు. కనకదుర్గ అమ్మవారిని భక్తితో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని వారి విశ్వాసం. దీక్షల విరమణ సమయంలో విజయవాడ నగరం మొత్తం ఎరుపు రంగు వస్త్రధారణలో ఉన్న భక్తులతో కనుచూపు మేర కిటకిటలాడుతుంది. గత కొన్నేళ్లుగా భవానీ దీక్షలను చేపట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
ఏటా ఐదారు లక్షల మంది ఈ దీక్షలు చేపడతారని అంచనా. దీక్షల్ని విరమించేందుకు వందల కిలోమీటర్లు కాలి నడకన వచ్చే వారు కూడా ఉంటారు. జాతీయ రహదారుల మీదుగా ఒడిశా బరంపురం వైపు నుంచి, తమిళనాడు నుంచి తెలంగాణ వైపు నుంచి వేలాది మంది భక్తులు దీక్షల విరమణకు తరలి వస్తుంటారు. దీక్షాధారణ ఎక్కడ చేపట్టినా విరమణ మాత్రం దుర్గగుడి హోమగుండంలో పూర్తి చేస్తారు.