Karthika Masam: కార్తీకమాసంలో నిత్యం ఆచరించవలసిన విధులు ఇవే… కార్తీక మాసంలో అర్చన ఫలాలు అందాలంటే ఇలా చేయండి
Karthika Masam: సంవత్సరంలోని పన్నెండు నెలలలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది, పుణ్యప్రదమైనది, శుభకరమైనది. ఈ నెల రోజులు ప్రతి ఒక్కరు శుచిగా, పవిత్రతతో మెలగిన యెడల వారికి, వారి కుటుంబానికి క్షేమము, భగవంతుని ఆశీస్సులు లభ్యం అవుతాయి. కార్తీక మాసంలో భగవంతుడి అనుగ్రహం లబించాలంటే ఇలా చేయండి..
Karthika Masam: కార్తీకమాసంలో ప్రతిరోజు దగ్గరలో ఉన్న నదిలోనో, చెరువులోనో లేక బావి మొదలైనవాటిలో సూర్యోదయం కాక ముందే స్నానం చేయటం శుభకరం. కొందరు అనుకొన్నట్లుగా కార్తీక మాస పుణ్య స్నానాలు కేవలం శైవులకే పవిత్రమైనవి కాదు. శైవులు, వైష్ణవు లందరికీ ఇది పవిత్రమైన మాసమేనని చెబుతారు. ఈ నెల రోజులపాటు నిత్యం వేకువజామున నదీస్నాము, నిత్య దేవాలయ, దైవదర్శనము, శక్తి కొలది దానం చేయడం, ఉపవాసాలు, సాయంకాల దీపదర్శనం నిత్య శుభములను కల్పిస్తాయి. అందుకే కార్తీక మాసంలో నెల రోజులు పరిపూర్ణ పర్వ దినాలుగా భావిస్తారు. కార్తీక మాసం హరిహరులకు ఇరువురికీ ప్రీతిపాత్రమైనదే.
కార్తీకమాసంలో కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు తులారాశిలో ఉండుట చేత ఈ కాలంలో ఆచరించే ఆరాధనలు, వ్రతాలు, దానధర్మాలు, దీపార్చనలు, ఉపవాసాలు, పురాణ శ్రవణం, పురాణపుస్తక దానం అనేక జన్మలలో చేసిన పాపాలను హరించివేస్తాయి.
సూర్యుడు తులారాశిలో ఉండగా మంచి మనస్సుతో ఏ సత్కర్మను చేసినా అవి అక్షయాలు అవుతాయని మహాఋషులు, పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే ఈ నెలరోజులు చేసే పుణ్యకార్యాలను కార్తీకవ్రతం అంటున్నారు. కార్తీక వ్రతమునునే తులాసంక్రమణము మొదలుకొని గానీ, కార్తీక శుక్ల పాడ్యమి మొదలుగాని ఆరంభించాలి.
ముందుగా కార్తీక వ్రతం స్నానవిధితో మొదలు అవుతుంది. ఈ స్నానం సంకల్పంతో ప్రారంభించాలి. సంకల్పం చెప్పుకొని, భగవంతునికి ముఖ్యంగా సూర్యునికి నమస్కరించి, స్నానం చెయ్యాలి.
నిత్యం ఇలా చేయండి…
1. కార్తీకమాసంలో ప్రతి ఒక్కరు ఉదయం స్నానం, భగవంతుని దర్శనం అయిన తరువాత ఉదయం ఇంటివద్దగల తులసి చెట్టువద్ద దీపారాధన చేసి తులసిపూజ చేయాలి.
2. సాయంకాలం నక్షత్ర దర్శనం కాగానే దీపం వెలిగించి ఒకటి తులసి చెట్టు దగ్గర మరొక దీపం గుమ్మం ప్రక్కన ఉంచాలి.
3. కార్తీక పురాణం చదివినంతసేపు దీపారాధన దేవుని వద్ద వెలుగుతూ ఉండాలి.
4. సంవత్సరంలోని ఏ నెలలోనైనా ద్వాదశినాడు తులసి దళాలను కోయకూడదు.
5. కార్తీక మాసంలో ఏ తిథిలో కూడా ఉసిరిక ఆకులను కోయరాదు.
6. కార్తీక మాసంలో ఉసిరిక చెట్టువద్ద లేక క్రింద విష్ణుపూజ చేసినవారు సమస్త క్షేత్రములలో విష్ణుపూజ చేసిన వారు అవుతారు
7. కార్తీకమాసంలో ప్రతిసోమవారం అవకాశం ఉన్నంత వరకు సోమవార వ్రతం ఆచరించటం ఉత్తమం.