AP Talliki Vandanam: ఈ ఏడాదికి తల్లికి వందనం లేనట్టే.. వచ్చే ఏడాది నుంచి అమలుకు సర్కారు కసరత్తు
AP Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హయంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకాల్లో అమ్మఒడి ఒకటి… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మఒడి స్థానంలో తల్లికి వందన పథకాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ పథకాన్ని వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
Jagananna Ammavodi: ఏపీలో 2024-25 విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం ఉండకపోవచ్చు. గత జూన్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ హాయంలో అమలు చేసిన ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో అమ్మఒడి స్థానంలో ప్రవేశపెట్టాల్సిన తల్లికి వందనం పథకం అమలుపై పలు మార్లు చర్చ జరిగింది. వైసీపీ హయంలో ఇంటికి ఒక్కరికి ఈ పథకాన్ని అమలు చేయగా తాము అధికారంలో కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉంటే అందరికి అమ్మఒడి పథకం స్థానంలో తల్లికి వందనం పథకాన్ని వర్తింప చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది.
2019-24 మధ్య కాలంలో వైసీపీ నాలుగు విడతల్లో అమ్మఒడి పథకాన్ని విద్యార్థులకు అందించింది. ఈ పథకంలో భాగంగా రూ.15వేలను లబ్దిదారులకు చెల్లించారు. తొలి ఏడాది పదో తరగతి వరకు చదువుకునే వారికి ఈ పథకాన్ని అమలు చేయగా తర్వాత ఇంటర్ విద్యార్థులకు కూడా పొడిగించారు. ఐదేళ్ల పాలనలో నాలుగు సార్లు అమ్మఒడి ద్వారా నగదు బదిలీ చేశారు.
నాలుగో విడతలో భాగంగా చివరి 2022-23 విద్యా సంవత్సరానికి 'జగనన్న అమ్మ ఒడి' పథకంలో భాగంగా లబ్దిదారుల ఖాతాలకు ముఖ్యమంత్రి నేరుగా నిధులు విడుదల చేశారు. 2023లో 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే 83,15,341 మంది విద్యార్థులకు అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరింది. పాఠశాలల్లో డ్రాపౌట్స్ సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే మంచి ఉద్దేశ్యంతో అమ్మ ఒడి పథకానికి కనీసం అటెండెన్స్ ఉండేలా నిబంధన అమలు చేశారు. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి, కనీసం 75% హాజరు ఉండేలా తల్లులు బాధ్యత తీసుకుంటే అప్పుడే విద్యారంగంలో మన ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాల లక్ష్యం నెరవేరుతుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేశారు.
అమ్మఒడి పథకం అమల్లోకి రాకముందు 2018లో ప్రాథమిక విద్యా స్థాయిలో జీఈఆర్ జాతీయ సగటు 99.21 శాతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఇది 84.48 శాతానికి పరిమితమైంది. దేశంలోని 29 రాష్ట్రాలలో అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండేది. వైసీపీ హయంలో విద్యారంగంలో తెచ్చిన సంస్కరణ వల్ల 84.48 శాతంగా ఉన్న జీఈఆర్ 100.8 శాతానికి చేరినట్టు అప్పట్లో ప్రభుత్వ గణాంకాలు చెప్పాయి.
ప్రస్తుతం ఏపీలో 61,343 పాఠశాలలు ఉన్ానయి. వీటిలో 72శాతం ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు ఒక శాతం, ప్రైవేట్ విద్యా సంస్థలు 27శాతం ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 79,75,284మంది విద్యార్ధులు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో 46శాతం, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 1శాతం, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 53శాతం చదువుకుంటున్నారు. ఉపాధ్యాయుల్లో 57శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,39,827మంది ఉపాధ్యాయులు ఉండగా 42శాతం మాత్రమే ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నారు. 2024-25లో విద్యా రంగానికి రూ.29వేల కోట్లను కేటాయించారు.
2023లో ఇంటికి ఒక్క విద్యార్థి చొప్పున 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేశారు.టీడీపీ ప్రభుత్వం ఇంట్లో ఎందరు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 80లక్షల మందిలో వైసీపీ హయంలో కంటే ఎక్కువ మందికి తల్లికి వందనం రూ.15వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.