Jagan Final Decision: ఆస్తులు పంచేది లేదు, 2019 ఒప్పందం అమలు చేసేది లేదు, ఇదే చివరి లేఖ.. స్పందించేది లేదన్న జగన్-there is no distribution of assets no implementation of the 2019 agreement this is the last letter ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagan Final Decision: ఆస్తులు పంచేది లేదు, 2019 ఒప్పందం అమలు చేసేది లేదు, ఇదే చివరి లేఖ.. స్పందించేది లేదన్న జగన్

Jagan Final Decision: ఆస్తులు పంచేది లేదు, 2019 ఒప్పందం అమలు చేసేది లేదు, ఇదే చివరి లేఖ.. స్పందించేది లేదన్న జగన్

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 29, 2024 07:32 AM IST

Jagan Final Decision: వైసీసీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి షర్మిలకు మధ్య జరుగుతున్న లేఖల యుద్ధంలో మరో లేఖను జగన్ విడుదల చేశారు. ఆస్తుల పంపకం ఇప్పటికే పూర్తైందని కొత్తగా చేసేదేమి లేదని అందులో తేల్చేశారు. ఈ అంశంపై ఇక స్పందించేది లేదని స్పష్టత ఇచ్చారు.

ఆస్తులు పంచేది లేదని తేల్చేసిన జగన్మోహన్ రెడ్డి
ఆస్తులు పంచేది లేదని తేల్చేసిన జగన్మోహన్ రెడ్డి

Jagan Final Decision: ఆస్తుల వ్యవహారంలో సోదరి షర్మిలతో తలెత్తిన వివాదాల నేపథ్యంలో మరో లేఖను జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. సరస్వతీ పవర్ షేర్లను బదలాయించుకోవడంపై ఇద్దరి మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో మొదలైన రగడకు ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ అంశంపై తాను ఇక స్పందించనని స్పష్టం చేశారు.

జగన్‌ షర్మిలకు రాసిన లేఖ యథాతథంగా.. " ప్రాపంచిక విషయాలే అత్యంత ముఖ్యమైనవని నమ్మే నీతో ఇకపై ఎలాంటి వ్యవహారాలను కొనసాగించలేన. నీ లేఖలో నువ్వు లేవనెత్తిన అంశాలన్నీ శుద్ధ తప్పు. మన దివంగత తండ్రి ఆయన తన జీవిత కాలంలో సంపాదించిన, పూర్వీకుల ద్వారా వచ్చిన ఆస్తులన్నింటినీ మన మధ్య సమానంగా పంపకం చేసిన విషయం మన కుటుంబ సభ్యులందరికీ తెలుసున్న సంగతి అందరికీ బాగా తెలుసు. నా చొరవ, కష్టంతో నేను నిర్మించిన కంపెనీలు. నేను సంపాదించిన ఆస్తులను నా ఇష్టానికి విరుద్ధంగా తీసుకోవడం ఎంత మాత్రం నీకు సబబు కాదు.

నువ్వు చెప్పేదే నిజమైతే, కుటుంబ ఆస్తులుగా చూపుతూ నువ్వు తప్పుగా కోరుతున్న ఆస్తులను నాన్న తన జీవిత కాలంలో సంపాదించి ఉంటే, వాటిని ఆయన నీకు ఎందుకు పంచలేదు. ఆయన ఆ పని ఎందుకు చేయలేదంటే, అవి ఆయన స్వార్జిత ఆస్తులు కాదు కాబట్టి.

నేను అంతకు ముందు నీకు రాసిన లేఖలోని అంశాలను మరోసారి ఇక్కడ పునరుద్ఘాటిస్తున్నా. గతంలో నీ మీద నాకు ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉన్నాయి కాబట్టే భవిష్యత్తులో నీకు చెందే విధంగా నా ఆస్తులను కొన్నింటినీ నీకు బదలాయించేందుకు అంగీకరించా. నాన్న మరణించిన పదేళ్ల తర్వాత.. నీ పెళ్లైన 20 ఏళ్ల తర్వాత కూడా నేను సంపాదించిన ఆస్తుల్లో వాటా ఇచ్చే విధంగా అంగీకరించానంటే అందుకు నాకు నీ మీద ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగమే కారణమన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి.

ఎంవోయూ ద్వారా నేను నీకు కొన్ని ఆస్తులు ఇవ్వదలిచాను. అయితే ఇంత చేసినా కూడా నీకు నా పట్ల కనీస కృతజ్ఞత లేదు. పైపెచ్చు. నైతికత, నిజాయితీ లేకుండా నా పట్ల మోసపూరితంగా వ్యవహరించావు.

అత్యాశకు అమ్మను వాడుకున్నావు..

నీ వ్యక్తిగత ప్రయోజనాలు, అత్యాశకు అమ్మను ఉపయోగించుకునేందుకు నువ్వు చేసిన ప్రయత్నాల నుంచి దృష్టిని మరల్చేందుకే నేను దాఖలు చేసిన కేసుల గురించి వ్యాఖ్యలు చేశావు. మన అమ్మకు నువ్వు తప్పుడు, అసత్య వాంగ్మూలం అంటగట్టావు. కోర్టు ఆమోదం పెండింగ్ లో ఉన్నందున, నా దగ్గర ఉన్న షేర్ సర్టిఫికేట్లను నేను ఎప్పుడూ నీకు ఇవ్వలేదు. నీకు తెలిసి కూడా అమ్మ షేర్ సర్టిఫికేట్లను, ట్రాన్స్పర్ ఫారంలను పోగొట్టిందన్న అపవాదును నువ్వు ఆమెపై వేయడం నాకు అత్యంత బాధ కలిగించింది.

ఈ పరిస్థితులు నువ్వు నీకు అనుకూలంగా మలచుకున్నావు. నీ అత్యాశ, కుతంత్రాల్లో అమ్మను కూడా పావుగా వాడుకున్నావు. నీ మీద ఉన్న నమ్మకంతో నీ పేరుపై 49 శాతం వాటాలను బదలాయించాను. ఈడీ కేసుల వల్ల వాటాల బదిలీ కోర్టు పరిధిలో ఉందని, వివాదం తేలి నేను వాటాలను బదిలాయించేంత వరకు వాటాల బదిలీ విషయంలో ఆగాలని నేను చెప్పినా కూడా వినలేదు.

అక్రమంగా వాటాల బదిలీ…

అక్రమంగా వాటాలను బదలాయించావు. ఈ బదలాయింపు కోర్టు అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదని తెలిసి కూడా నువ్వు వాటాల బదలాయింపు చేశావు. తద్వారా నా కోర్టు కేసులను క్లిష్టతరం చేసేందుకు ప్రయత్నించావు. నువ్వు నీ వ్యక్తిగత ఉన్నతి. అత్యాశ కోసం అమ్మను ఓ సాధనంగా వాడుకోవడం ఆపుతావని నేను నమ్ముతున్నా.

తప్పుడు ప్రకటనలకు అమ్మను ఓ సాక్షిగా, అమలుకర్తగా చేశావు. క్షమార్హం కాని అక్రమ చర్యల్లో ఆమెను భాగం చేశావు. గత కొద్ది సంవత్సరాలుగా అమ్మను నీ భావోద్వేగాలకు నువ్వు వాడుకుంటున్న విషయం జగమెరిగిన సత్యం. మన ప్రియతమ తండ్రి పేరును ప్రతిబింబించేలా ఉన్న వైఎస్సార్సీపీ పార్టీకి కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ఓట్లను అభ్యర్థించే పరిస్థితిని ఆమెకు కల్పించావు.

ఎన్నికల ప్రచారం గంటలో ముగుస్తుందనగా, మోసపూరితంగా అమ్మ వీడియోను విడుదల చేశావు. నాన్న ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీకి ప్రయోజనం చేకూర్చాలన్న ఉద్దేశంతోనే అలా చేశావు. తద్వారా కోట్ల మంది వైఎస్సార్ అభిమానులకు, మద్దతుదారులకు తీవ్ర వేదనను కలిగించావు.

నువ్వు నీ సొంత వ్యూహాల్లో అమ్మను భాగం చేశావు. కోర్టు అనుమతి లేకుండా షేర్లను బదిలీ చేస్తే నాకు న్యాయపరమైన సమస్యలు వస్తాయని తెలిసే షేర్ల బదలాయింపు చేశావు. షేర్ల బదలాయింపును నువ్వు రహస్యంగా అమలు చేశావు. అంతేకాక షేర్ సర్టిఫికేట్లు, షేర్ ట్రాన్స్ఫర్ ఫారంలు పోయినట్లుగా కూడా ఆమె చేత తప్పుడు ప్రకటనలు ఇప్పించావు. అంతిమంగా అక్రమ పద్ధతిలో వాటాలను బదలాయింపు చేశావు. దీని వల్ల కొడుకుగా నాకు న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా నీ చర్యల్లో భాగస్వామి అయింది. ఆమె తటస్థతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. అంతేకాక ఆమె ఒకవైపే ఉందన్న భావన కలిగిస్తోంది.

చేతల ద్వారా చేసి చూపించావు..

మాటల కన్నా చేతలే ఎక్కువ చెబుతాయన్నది చేసి చూపావు. నీ ప్రవర్తన, చర్యలు కోర్టుల్లో ఉన్న కేసులను ప్రతికూల రీతిలో ప్రభావితం చేసేలా ఉన్నాయి. తద్వారా ఒకవైపు ఆస్తులపై హక్కులు కోరుతూ, మరోవైపు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నావు. కేసుల ఫలితం పట్ల నీకుఆసక్తి లేనట్లు ప్రవర్తిస్తున్నావు. నన్ను ఆర్థికంగా బలహీనుడిని చేసేందుకు అనుగుణంగా నీ చర్యలను రచించావు. న్యాయపరంగా నా కేసులను గందరగోళం చేయాలని భావించావు. అన్నీ ఆస్తులు కూడా ఈ రోజుకీ కోర్టు, ఈడీ కేసుల్లో చిక్కుకుని ఉన్నాయి.

వాస్తవానికి ఇవేవీ కూడా నీకు పట్టవు. నువ్వు నీ ప్రతి అడుగు కూడా నా ప్రత్యర్థులకు, సీబీఐ, ఈడీకి లబ్ది చేకూర్చేందుకే వేస్తున్నావు. నా కేసులను క్లిష్టతరం చేస్తున్నావు. సీబీఐ చార్జిషీట్లో నాన్న పేరు ఉండటానికి నేనే కారణమని నువ్వు నీ తప్పుడు ప్రకటనల ద్వారా చెబుతున్నావు. నా ప్రత్యర్థులతో చేతులు కలిపావు. అది నీ మనస్తత్వం ఎలాంటిదో చెప్పకనే చెబుతోంది. షేర్ల బదిలీ విషయంలో నువ్వు అనుసరించిన మోసపూరిత విధానాలు నన్ను ఎంతో వేదనకు గురి చేశాయి. ఇందులో అమ్మను కూడా లాగావు. షేర్ల బదిలీ విషయంలో నీతో పంచుకున్న న్యాయ సలహాలకు విరుద్ధంగా నువ్వు వ్యవహరించావు.

నా కష్టార్జితంతో సంపాదించిన ఆస్తులు…

నువ్వు లేవనెత్తిన అంశాలన్నీ, కుటుంబ వనరులు వాడటంతో సహా అన్ని నేను చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. నేను నా కష్టార్జితంతో సంపాదించిన ఏ ఆస్తిలో కూడా భాగం కోరే హక్కు నీకు లేదు. నేను నీపై ఉన్న ప్రేమ, ఆప్యాయతతో కొన్ని ప్రయోజనాలను ఇచ్చేందుకు ప్రయత్నించాను. గత పది సంవత్సరాలుగా నేను నీకు రూ.200 కోట్లకు పైగా ఇచ్చాను. ఇందుకు అదనంగా మరిన్ని ఆస్తులను కూడా ఇవ్వాలనుకున్నా. అయితే నీ అనైతిక చర్యలు నా మనస్సును గాయపరచడమే కాకుండా పరిస్థితులను ఇక్కడి వరకు తీసుకొచ్చాయి..

నీ ఆస్తుల్లో హక్కు కోరడం లేదు..

నీ 25 ఏళ్ల వైవాహిక జీవితంలో నువ్వు కూడా కొన్ని వారసత్వ ఆస్తులను పొందావు. కొన్నింటిని సొంతగా సంపాదించావు. కొన్ని కంపెనీల మీద రుణాలు తీసుకుని ఆస్తులు కూడబెట్టావు. వ్యాపారాలు చేశావు. వాటిపై ఎన్నడూ కూడా నేను ఎలాంటి హక్కును కోరలేదు. నీకు కూడా ఇదే వర్తిస్తుంది. నువ్వు నా కంపెనీల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు.

నా కంపెనీలు నడిచేందుకు ఎలాంటి సాయం చేయలేదు. రిస్క్ తీసుకునే విషయంలో గ్యారంటీర్గా సంతకం కూడా చేయలేదు. నా కంపెనీల రుణాలపై నువ్వేం బాధ్యత తీసుకోలేదు. నా కంపెనీల నష్టాలను నువ్వు పంచుకోలేదు. నువ్వెలాంటి కేసులను ఎదుర్కోలేదు. కంపెనీలపై తప్పుడు అభియోగాలపై నువ్వు జైలుకెళ్లలేదు. మరలాంటప్పుడు నువ్వు నా ఆస్తులపై హక్కు ఎలా కోరతావు.

ఎంఓయూ అమలు చేసేది లేదు…

అందుకే నువ్వు నీ లేఖలో చేసిన అన్నీ నిరాధార ఆరోపణలను, ప్రకటనలను ఖండిస్తున్నా. చట్టం పట్ల నీకు ఎలాంటి గౌరవం లేనందున, ఎంవోయూ అమలులో విషయంలో నా అభిమతాన్ని నేను ఉపసంహరించుకుంటున్నా. నా సమ్మతి ఉపసంహరణ తరువాత కూడా ఆ ఎంవోయూ ఇంకా అమల్లో ఉందన్న నీ అసత్య ప్రకటనను ఖండిస్తున్నా.

ఇకపై నేను నీ తదుపరి లేఖలకు ఏ విధంగానూ స్పందించను. నువ్వు పంపే లేఖలను గానీ, అందులోని అంశాలను గానీ ఆమోదించినట్లు లేదా తిరస్కరించినట్లు భావించవద్దు. ప్రస్తుతం కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. అందువల్ల నేను ఇకపై ఏమీ మాట్లాడదలచుకోలేదు" అని జగన్ లేఖను ముగించారు.

Whats_app_banner