YSRCP : ముఖ్య నేతలతో జగన్ భేటీ - దాడులపై గవర్నర్ కు వైసీపీ ఫిర్యాదు-the ycp leaders complained to the governor about the attacks ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp : ముఖ్య నేతలతో జగన్ భేటీ - దాడులపై గవర్నర్ కు వైసీపీ ఫిర్యాదు

YSRCP : ముఖ్య నేతలతో జగన్ భేటీ - దాడులపై గవర్నర్ కు వైసీపీ ఫిర్యాదు

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Jun 06, 2024 07:12 PM IST

YS Jagan Meeting with Party Leaders : వైసీపీ నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. టీడీపీ దాడులతో నష్టపోయిన ప్రతి కార్యకర్తకు అండగా నిలవాలని సూచించారు. మరోవైపు దాడులపై గవర్నర్ ను కలిసి నేతలు ఫిర్యాదు చేశారు.

వైసీపీ నేతలతో జగన్ సమావేశం
వైసీపీ నేతలతో జగన్ సమావేశం

YS Jagan Meeting with Party Leaders : వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై చర్చించారు. అధికార పార్టీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా నిలవాలని జగన్ ఆదేశించారు.

ఎన్నికల ఫలితాల అనంతరం చోటు చేసుకుంటున్న దాడుల అంశంపై గవర్నర్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు గురువారం సాయంత్రం తర్వాత రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ…. బీహార్ తరహాలో టీడీపీ దాడులు చేస్తోందని ఆరోపించారు. వైఎసార్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని ఆరోపించారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని… వైఎసార్సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారని చెప్పారు.

“ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఫిర్యాదు చేశాం. టీడీపీ దాడులు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా .. లేనట్టా ? పోలీసుల తీరుపై కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేశాం. నూజివీడులో పట్టపగలే వైసీపీ కౌన్సిలర్ పై టీడీపీ నేత కత్తితో దాడి చేసినా పట్టించుకోలేదు” అని పేర్ని నాని విమర్శించారు.

దాడులపై వైఎస్ జగన్ ట్వీట్

పీలో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. "రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని, వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. “గౌరవ గవర్నర్‌ వెంటనే జోక్యం చేసుకుని పచ్చ మూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం” అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయం పాలైంది. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం అయ్యింది. ఐదేళ్లుగా వైసీపీ తమను రాజకీయంగా వేధించిందనే ఆరోపణలతో పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత అల్లర్లను అదుపు చేయడానికి రాష్ట్రంలో కేంద్ర బలగాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధ్యక్షుడు ట్వీట్ చేశారు.

మరోవైపు తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్ మార్పుపై వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లిలోని జగన్‌ నివాసం పక్కనున్న క్యాంపు కార్యాలయానికి పార్టీ కార్యాలయం మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక్కడ్నుంచే పార్టీ కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉంది.

Whats_app_banner